- మరితం సులభంగా పన్ను చెల్లింపు ప్రక్రియ
- పన్ను ఎగవేత దారులపై ప్రత్యేక దృష్టి
- ఆదాయాన్నిచ్చే శాఖలపై సిఎం జగన్ సవిూక్ష
అమరావతి,నవంబర్ 14 (ఆంధ్రపత్రిక): పన్ను చెల్లింపుదారులకు మరింత అవగాహన కల్పించాలని.. పన్ను చెల్లింపు పక్రియను మరింత సులభతరం చేయాలని ఏపీ సీఎం జగన్ ఆదేశించారు. ఆదాయాన్నిచ్చే శాఖలపై సీఎం క్యాంపు కార్యాలయంలో ఆయా శాఖల అధికారులతో జగన్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పన్ను చెల్లింపుదారులకు మరింత అవగాహనకల్పించాలని.. పన్ను చెల్లింపు పక్రియను మరింత సులభతరం చేయాలన్నారు.. పన్ను ఎగవేసే సంస్థలపై ప్రత్యేక దష్టి సారించాలని ఆయన అధికారులకు సూచించారు.అక్రమాలకు పాల్పడే సంస్థలపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. రాష్ట్ర ఆదాయం పెరిగేలా ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించాలని కూడా ఆయన అధికారులకు సూచించారు. అలాగే రాష్ట్రంలో మద్యం విక్రయాలు భారీగా తగ్గాయని జగన్ అన్నారు. బెల్టు షాపుల తొలగింపు, పర్మిట్ రూముల రద్దుతో విక్రయాలు తగ్గాయని ఆయన అన్నారు. ధరల పెంపు కూడా మద్యం విక్రయాల తరుగుదలకు ఓ కారణంగా నిలిచిందని జగన్ చెప్పారు. అక్రమ మద్యం తయారీ, విక్రయంపై ఎస్ఈబీ ప్రత్యేక దృష్టి సారించాలని జగన్ ఆదేశాలు జారీ చేశారు. గంజాయి, అక్రమ మద్యం కేసులపై ప్రత్యేక దృష్టి పెట్టాలని జగన్ అన్నారు. ఏజెన్సీలో అర్హులకు ఆర్వోఎఫ్ఆర్ పట్టాలు ఇవ్వాలని, శాశ్వత భూ హక్కు, భూసర్వేపై అవగాహన కల్పించాలని అధికారులకు జగన్ స్పష్టంగా చెప్పారు. నిరుపయోగంగా ఉన్న మైనింగ్ ఏరియాలో కార్యకలాపాలు మొదలుపెట్టాలని జగన్ ఆదేశాలు ఇచ్చారు.ఇదిలావుంటే రాష్ట్రంలో రవాణా వాహనాలకు పెంచిన గ్రీన్ ట్యాక్స్‌ను ఉపసంహరించుకోవాలని ఆంధ్రప్రదేశ్ లారీ ఓనర్స్ అసోసియేషన్ కోరింది. ఈ మేరకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి వైవి ఈశ్వరరావు ఇప్పటికే లేఖ రాశారు. రాష్ట్రంలో రవాణా రంగం తీవ్ర సంక్షోభంలో ఉందని లేఖలో పేర్కొన్నారు. సరిహద్దు రాష్టాల్ర కంటే డీజిల్ ధర, వగైరా ఎక్కువ వల్ల ఇతర రాష్ట్ర కిరాయిలతో పోటీ పడలేక లారీ యాజమానులు ఇబ్బందులు పడుతున్నారని వివరించారు. ఈ పరిస్థితుల్లో రాష్ట్రప్రభుత్వం గ్రీన్ ట్యాక్స్‌ను భారీగా పెంచిందని తెలిపారు. సరిహద్దు రాష్టాల్లో ఎక్కడా కూడా ఈ స్థాయిలో గ్రీన్‌ట్యాక్స్ ఎవరూ వసూలు చేయటం లేదని పేర్కొన్నారు. కర్ణాటక, తమిళనాడు, తెలంగాణ రాష్టాల్రో గ్రీన్ ట్యాక్స్ మన రాష్ట్రంతో పోలిస్తే తక్కువగా ఉందన్నారు. ఈ విషయాన్ని పరిశీలించి పెంచిన గ్రీన్ ట్యాక్స్ వెంటనే తగ్గించాలని కోరారు. లేఖ కాపీలను రవాణ శాఖ మంత్రి, ఆ శాఖ ముఖ్యకార్యదర్శి, కమిషనర్లకు కూడా పంపారు. ఈసవిూక్షలో విద్యుత్, అటవీ పర్యావరణ, భూగర్భ గనులశాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, సీఎస్ సవిూర్ శర్మ, అటవీ, పర్యావరణం, సైన్స్ అండ్ టెక్నాలజీ స్పెషల్ సీఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్, పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ స్పెషల్ సీఎస్ వై శ్రీలక్ష్మి, ఎక్సైజ్, రిజిస్టేష్రన్ అండ్ స్టాంప్స్ స్పెషల్ సీఎస్ రజత్ భార్గవ, రవాణాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్, పంచాయతీరాజ్, గ్రావిూణాభివృద్ధిశాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, ఆర్ధికశాఖ కార్యదర్శి కె వి వి సత్యనారాయణ, ఎక్సైజ్ కమిషనర్ వివేక్ యాదవ్, స్టేట్ టాక్సెస్ చీప్ కమిషనర్ గిరిజా శంకర్, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు.