టిఆర్ఎస్ తీరుపై మండిపడ్డ షర్మిల
కరీంనగర్,నవంబర్ 14 (ఆంధ్రపత్రిక): తాను వైఎస్ బిడ్డనని, ఎవ్వరికీ భయపడే ప్రసక్తి లేదని తెలంగాణ వైసిపి పార్టీ నేత వైఎస్ షర్మిల స్పష్టం చేశారు. తనపై ఎవరు దాడి చేసినా చూస్తూ ఊరుకునేది లేదని హెచ్చరించారు. ఈ మేరకు టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలకు వైఎస్ షర్మిల తీవ్ర హెచ్చరికలు చేశారు. వైఎస్సార్ విగ్రహాలు , ప్లెక్సీలను ధ్వంసం చేస్తే ఊరుకునేదిలేదన్నారు. సోమవారం ఆమె ఇక్కడ విూడియాతో మాట్లాడుతూ ఊపిరి ఉన్నంతవకు తెలంగాణ గడ్డను వదిలేదిలేదని ఆమె స్పష్టం చేశారు. కాళేశ్వరం అవినీతి గురించి మాట్లాడు తున్నందుకే తనపై, తన పార్టీపై టీఆర్ఎస్ దాడులకు దిగుతోందని ఆరోపించారు. వైఎస్సార్ అభిమానులు, ఆయన పథకాల వల్ల లబ్దిపొందినవారు కోట్లలో ఉన్నారని, ఇలాంటి పనులు చేస్తే సహించరని, రాళ్లు, చెప్పులతో కొట్టే రోజు దగ్గరలో ఉందని హెచ్చరించారు. ఇలాంటివాటికి తాను అసలు భయపడనని అన్నారు. ఒక్కసారి దిగిన తర్వాత రాజశేఖర్ బిడ్డ వెనుకడుగువేసే ప్రసక్తేలేదని అన్నారు. కాళేశ్వరం అవినీతిపై మాట్లాడుతున్న ఏకైక వ్యక్తిని తానేనని షర్మిల స్పష్టం చేశారు.