విడివిడిగా విచారిస్తామన్న సుప్రీంకోర్టు
న్యూఢల్లీి,నవంబర్ 14 (ఆంధ్రపత్రిక): అమరావతి రాజధాని కేసుల విచారణను దేశ అత్యున్నత న్యాయస్థానం వాయిదా వేసింది. రాజధాని అంశం, రాష్ట్ర విభజనపై దాఖలైన 35 పిటీషన్లను కలిపి సుప్రీంకోర్టు విచారించింది. రాష్ట్ర రాజధానిని నిర్ణయించే అధికారం ప్రభుత్వానికి లేదని ఏపీ హైకోర్టు స్పష్టం చేసింది. దీనిని సవాల్ చేస్తూ..ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ క్రమంలో పిటిషన్ను విచారించిన సుప్రీంకోర్టు విచారణను ఈనెల 28కి వాయిదా వేసింది. అయితే రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా దాఖలైన పిటీషన్లను, అమరావతి అంశంపై దాఖలైన పిటీషన్లను వేర్వేరుగా విచారించాలని దేశ అత్యున్నత న్యాయస్థానం నిర్ణయించింది. ఈ క్రమంలో రాష్ట్ర విభజన పిటిషన్లపై విచారణను సుప్రీంకోర్టు ఈ నెల 28కి వాయిదా వేసింది. అమరావతిపై 8, రాష్ట్ర విభజనపై 28 పిటిషన్లు దాఖలయ్యాయి. రాష్ట్ర విభజన, అమరావతి రాజధాని కేసులను విడివిడిగానే విచారిస్తామని సుప్రీంకోర్టు ధర్మాసనం పేర్కొంది. 2 కేసులను విడివిడిగా విచారించాలని ప్రభుత్వం తరపున కోరామని సీనియర్ కౌన్సిల్ అభిషేక్ మనుసింఫ్వీు, మాజీ ఏజీ వేణుగోపాల్ తెలిపారు. హైకోర్టులో అమరావతి రైతులు వేసిన కోర్టు ధిక్కరణ పిటిషన్లను కేకే వేణుగోపాల్ సుప్రీంకోర్టు దృష్టికి తీసుకొచ్చారు. సుప్రీంకోర్టులో విచారణ పూర్తయ్యేవరకు హైకోర్టులో ధిక్కార పిటిషన్లపై రైతులు ఒత్తిడి తేకపోవచ్చని ధర్మాసనం తెలిపింది. రాజధానిని నిర్ణయించే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి లేదన్న హైకోర్టు తీర్పును ప్రభుత్వ న్యాయవాది వైద్యనాథన్ చదివి వినిపించారు. ఏపీ హైకోర్టు తీర్పుపై స్టే విధించాలని కోరినట్లు న్యాయవాది వైద్యనాథన్ పేర్కొన్నారు. 28న అన్ని అంశాలను పరిశీలిస్తామని సుప్రీంకోర్టు ధర్మాసనం స్పష్టం చేసింది.