రెవెన్యూ మంత్రి ధర్మాన ప్రసాదరావు
ఉమారుద్రకోటేశ్వర స్వామి పాలక మండలి ప్రమాణ స్వీకారం
శ్రీకాకుళం, నవంబరు 3 (ఆంధ్రపత్రిక బ్యూరో): ఎవరిపైనో అజమాయిషీ చేయడానికి నియమించిన పదవులు కావు.. దేవుడికి సేవ చేసేందుకు నియమించిన కమిటీలోని ప్రతి ఒక్కరూ బాగా పనిచేయాలని రాష్ట్ర రెవెన్యూ మంత్రి ధర్మాన ప్రసాదరావు అన్నారు. ప్రముఖ పుణ్య క్షేత్రం ఉమారుద్ర కోటేశ్వర స్వామి ఆలయ నూతన పాలకమండలి ప్రమాణ స్వీకా రోత్సవం గురువారం ఘనంగా జరిగింది. మంత్రి ధర్మాన ప్రసాదరావు ఆధ్వర్యంలో పాలకమండలి చైర్మన్ సుంకరి కృష్ణ, ప్రత్యేక ఆహ్వానితుడు ఉరిటి శ్రీనివాస్‌తో పాటు మరో ఏడు గురు సభ్యులచే ఆలయాధికారులు ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ ఆలయ అభివృద్ధికి, భక్తులకు సేవలు అందించేందుకు దోహదపడాలని కోరారు. ఆలయ విశిష్టతను మరింత పెంచాలన్నారు. ట్రస్టు బోర్డు సభ్యులకు అభినందనలు తెలియజేశారు. కార్యక్రమంలో ఆలయాధికారులతో పాటు ట్రస్టు బోర్డు చైర్మన్ సుంకరి కృష్ణ కుమార్, ప్రత్యేక ఆహ్వానితుడు ఉరిటి శ్రీనివాసరావు, సభ్యులు నక్క రామరాజు, తొనంగి అధిబాబు, నల్లాపల్లి యమునా, గాలి హైమావతి, అంధవరపు బాలమని, పూసర్ల శ్రీదేవి, ఎక్స్ ఆఫీసియో సభ్యుడు ఆరవెల్లి శ్రీరామమూర్తి, తదితరులు పాల్గొన్నారు.