వడోదరలో సీ-295 ట్రాన్స్పోర్ట్ ఎయిర్‌క్రాఫ్ట్ తయారీ కేంద్రం
- రూ.22వేల కోట్ల భారీ ప్రాజెక్టుకు మోదీ శంకుస్థాపన
- విమానయాన రంగంలో అభివృద్ధి వైపు భారత్
- తయారీ విధానానికి భాజపా పెద్దపీట
- భారత్‌లో తయారీ… ప్రపంచం కోసం తయారీలో క్రమంగా పెరుగుతున్న సామర్థ్యం
- ఐరోపాకు చెందిన ఎయిర్‌బస్ సంస్థ బయటి దేశాల్లో సి-295 విమానాలను తయారు చేయడం ఇదే తొలిసారి
- భారత రక్షణ ఏరోస్పేస్ రంగంలో ఇంతపెద్ద మొత్తంలో పెట్టుబడులు రావడం ఇదే తొలిసారి ప్రధాని నరేంద్ర మోదీ
న్యూధిల్లీ,అక్టోబరు 30 (ఆంధ్రపత్రిక): విమానయాన రంగంలో స్వావలంబన దిశగా భారత్ కీలక ముందడుగు వేసిందని ప్రధాని నరేంద్రమోదీ అన్నారు. వడోదరలో సీ-295 ట్రాన్స్పోర్ట్ ఎయిర్‌క్రాఫ్ట్ తయారీ కేంద్రానికి ఆయన శంకుస్థాపన చేశారు. దాదాపు రూ.22 వేల కోట్లతో టాటాల భాగస్వామ్యంతో ఎయిర్‌బస్ సంస్థ ఈ ప్రాజెక్టును చేపడుతోంది. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ.. భారత రక్షణ ఏరోస్పేస్ రంగంలో ఇంతపెద్ద మొత్తంలో పెట్టుబడులు రావడం ఇదే తొలిసారి అని అన్నారు. భాజపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కీలక ఆర్థిక సంస్కరణలు చేపట్టామని, దీనివల్లే తయారీ రంగంలో పెద్దమొత్తంలో పెట్టుబడులు వస్తున్నాయని తెలిపారు. విమానయాన రంగంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశంగా భారత్ గుర్తింపు పొందిందని అన్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఎయిర్ ట్రాఫిక్ ఎక్కువగా ఉన్న మూడు దేశాల్లో త్వరలో భారత్ చోటు సంపాదిస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
కొవిడ్ మహమ్మారితోపాటు, ఇటీవల సరిహద్దుల్లో చోటు చేసుకుంటున్న పరిణామాల నేపథ్యంలో భారత్‌లో తయారీ విధానానికి భాజపా ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని మోదీ చెప్పారు. ఈ క్రమంలోనే దేశంలో ట్రాన్స్పోర్ట్ ఎయిర్‌క్రాఫ్ట్ తయారీ కేంద్రాన్ని నిర్మిస్తున్నట్లు పేర్కొన్నారు. వీటివల్ల భారత ఆర్మీ శక్తిసామర్థ్యాలు మరింత పెరగడమే కాకుండా.. విమానాల తయారీ రంగంలో భారత్ మరో అడుగు ముందుకేసినట్లవుతుందని చెప్పారు. భారత్ అనుసరిస్తున్న ‘’భారత్‌లో తయారీ..ప్రపంచం కోసం తయారీ’’ సామర్థ్యం క్రమంగా పెరుగుతోందని మోదీ పేర్క్న్న్షొరు. ఐరోపాకు చెందిన ఎయిర్‌బస్ సంస్థ బయటి దేశాల్లో సి-295 విమానాలను తయారు చేయడం ఇదే తొలిసారి. భారత వైమానిక దళంలో ప్రస్తుతం సేవలందిస్తున్న అవ్రో-748 రవాణా విమానాల స్థానంలో, ఎయిర్‌బస్‌కు చెందిన సి-295 రవాణా విమానాలను ప్రవేశపెట్టాలని గత ఏడాది సెప్టెంబరులో కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం 56 విమానాలు అందించేందుకు ఎయిర్‌బస్‌తో రూ.21,935 కోట్లతో ఒప్పందం కుదిరింది. 2023 సెప్టెంబరు నుంచి 2025 ఆగస్టు మధ్య 16 విమానాలను ఫ్లై-అవే కండీషన్లో ఎయిర్‌బస్ భారత్‌కు అందజేస్తుంది. మిగిలిన 40 విమానాల తయారీ, అసెంబ్లింగ్‌ను టాటా గ్రూప్‌నకు చెందిన టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్స్ (టీఏఎస్ఎల్) దేశీయంగా చేపడుతుంది. తొలి దేశీయ తయారీ రవాణా విమానం 2026 సెప్టెంబరులో అందుబాటులోకి రావొచ్చని సమాచారం.
ఈ విమానాల్లో 40-45 మంది పారాట్రూపర్లు లేదా 70 మంది పౌరులు ప్రయాణించొచ్చు. 5-10 టన్నుల వస్తువులను రవాణా చేసే సామర్థ్యంతో వీటిని రూపొందిస్తారు. భారత్ ఎలక్ట్రానిక్స్, భారత్ డైనమిక్స్ లిమిటెడ్ అభివృద్ధి చేసిన ఎలక్ట్రానిక్ వార్ఫేర్ సూట్లను 56 విమానాలకూ అమర్చుతారు. తక్కువ దూరం రన్‌వే సరిపోవడంతో పాటు, తాత్కాలికంగా అభివృద్ధి చేసిన ప్రాంతాల నుంచి కూడా టేకాఫ్ చేసే సామర్థ్యం వీటికి ఉంటుంది. ఈ ప్రాజెక్ట్ వల్ల ప్రత్యక్షంగా 600 మంది అత్యున్నత నైపుణ్యాలు కలిగిన వారికి ఉపాధి లభిస్తుంది. మరో 3000 పరోక్ష ఉద్యోగాలు, 3,000 మంది మధ్యశ్రేణి నైపుణ్యాలు కలిగిన వారికి అవకాశాలు లభించనున్నాయి.