తమను వేధిస్తున్నారంటూ నిరసన
తిరుమల,అక్టోబర్27(ఆంధ్రపత్రిక): తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ తిరుమలలోని క్షురకులు కల్యాణకట్టల వద్ద ధర్నా నిర్వహించారు. విధులకు గైర్హాజరై నిరసనను తెలియజేశారు. తిరుమల,తిరుపతి దేవస్థానం అధికారులు తమను వేధిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. పనులను నిలిపివేయడంతో తలనీలాలతో మొక్కులు తీర్చుకునేందుకు వచ్చిన భక్తులు ఇబ్బందులకు గురయ్యారు. ప్రతిరోజూ తిరుమలకు వేలాది సంఖ్యలో భక్తులు శ్రీవారిని దర్శించుకునేందుకు దేశంలోని నలుమూలల నుంచి వస్తున్నారు. వీరిలో సగానికి మందికి పైగా భక్తులు తలనీలాలు సమర్పించుకుంటున్న విషయం తెలిసిందే. ఈనెల 22న 34,625 మంది భక్తులు, 23న 31,608 మంది, 24న 17,660 మంది, 25న 9,764 మంది భక్తులు తలనీలాలు సమర్పించుకున్నారు. క్షురకులను ఇబ్బందులపెట్టే చర్యలను మానుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. కల్యాణకట్టలలో క్షురకుల కొరతతో కల్యాణకట్టల దగ్గర భక్తులు బారులు తీరారు. విజిలెన్స్ సిబ్బంది వేధింపులతో క్షురకులు ఈరోజు ఉదయం నుంచి విధులు బహిష్కరించారు. దీంతో ఐదు గంటలపాటు నిరీక్షించినప్పటికీ భక్తులు తలనీలాలు సమర్పించలేకపోతు న్నారు. దర్శన సమయం మించి పోతుండటంతో భక్తులు ఆందోళనకు గురయ్యారు. భక్తులు అవస్థలు పడుతున్నప్పటికీ టీటీడీ అధికారులు పట్టించుకోని పరిస్థితి నెలకొంది. దీంతో టీటీడీ అధికారుల తీరుపై భక్తులు తీవ్రస్థాయిలో మండిపడ్డారు.