కూతురి పెళ్లి ఏర్పాట్లకే రూ.55 కోట్ల ఖర్చు.. 40 దేశాల నుంచి 30 వేల మంది అతిథులు.. ఇంతకీ ఈ ఎన్నారై ఎవరంటే..

ఎన్నారై డెస్క్: పెళ్లి ఏర్పాట్లకే రూ. 55 కోట్ల ఖర్చు.. 42 దేశాల నుంచి వచ్చిన 30 వేల మంది అతిథులు.. కేరళలో సుమారు ఎనిమిదేళ్ల క్రితం ఓ ఎన్నారై ఇంట జరిగిన వివాహ వేడుక విశేషాలు ఇవి. రాష్ట్రంలోని అత్యంత సంపనుల్లో ఒకరైన ఎన్నారై వ్యాపారవేత్త రవీ పిళ్లై కుమార్తె డా. ఆరతి రవీ పిళ్లై వివాహం 2015 నవంబర్ అత్యంత వైభవంగా జరిగింది. కేరళ ప్రజలు మునుపెన్నడూ చూడని రీతిలో జరిగిన ఈ వివాహ వేడుక గురించి ఇప్పటికీ అక్కడి వారు కథలుకథలుగా చెప్పుకొంటారు.
కొల్లామ్లో జరిగిన ఈ వివాహానికి 42 దేశాల నుంచి 30 వేల మంది అతిథులు వచ్చారట. ఖతార్ దేశం నుంచి రాజకుటుంబీకులు కూడా విచ్చేశారు. ఎనిమిది ఎకరాల్లో ఏర్పాటు చేసిన వివాహ వేదికను సిద్ధం చేసేందుకు ప్రముఖ ఆర్ట్ డైరెక్టర్ సాబు సిరిల్కు ఏకంగా 75 రోజులు పట్టిందట. 200 మంది నిపుణులు పెళ్లి మండపాన్ని సిద్ధం చేశారు. ఇక పెళ్లి రోజున ఆరతి..మనీష్ మల్హోత్రా డిజైన్ చేసిన సిల్క్ చీరలో మెరిసిపోయారు. మొత్తం వజ్రాలతో చేసిన నగలనే ధరించారు. ఇక వరుడు డా. ఆదిత్య విష్ణు భారీ రథంపై వేదిక వద్దకు చేరుకున్నారు.
అంగరంగ వైభవంగా జరిగిన ఈ వివాహానికి సినీ రాజకీయ, వ్యాపార రంగ ప్రముఖులు ఎందరో హాజరయ్యారు. అతిథుల కోసం నటి శోభన, మంజూ వారియర్ల నృత్య ప్రదర్శన విశేషంగా ఆకట్టుకుంది. స్టీఫెన్ దెవాసీ ఆధ్వర్యంలో జరిగిన మ్యూజికల్ షో, ప్రముఖ కొరియోగ్రాఫర్ సూర్య సారథ్యంలో 400 మంది డ్యాన్సర్లతో నిర్వహించిన మరో ప్రదర్శన కూడా హైలైట్గా నిలిచాయి. ఒకేసారి 7 వేల మందికి భోజనాలు వడ్డించగలిగేలా భారీ డైనింగ్ హాల్స్ ఏర్పాటు చేశారు. అత్యంత భారీ స్థాయిలో నిర్వహించిన వేడుకగా ఈ వివాహం చరిత్రలో నిలిచిపోయింది. అయితే.. కేరళలో పర్యాటకాన్ని ప్రోత్సహించేందుకు తాను ఖర్చుకు వెరవకుండా తన కుమార్తె వివాహాన్ని జరిపించానని అప్పట్లో ఆయన చెప్పుకొచ్చారు. కేరళ ప్రజలు ఇప్పటికీ ఈ వివాహ వేడుక గురించి చర్చించుకుంటారంటే నాటి వేడుక ఎంత ఘనంగా జరిగిందో ఇట్టే ఊహించుకోవచ్చు.