హైదరాబాద్: బీసీ ఉద్యమం బలోపేతానికే తాను రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసినట్లు బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య తెలిపారు. రాజకీయాలకు అతీతంగా ఉద్యమం చేయబోతున్నట్లు చెప్పారు.
దీనిద్వారా దేశవ్యాప్తంగా ఉన్న బీసీలకు న్యాయం జరగాలన్నారు. విద్యానగర్లోని బీసీ భవన్లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.
”వివిధ పద్ధతుల్లో ఉద్యమం చేస్తాం. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు బీసీలకు న్యాయం చేయడం లేదు. బీసీల తరఫున చట్టసభల్లో ప్రశ్నించినా సమాధానం రాలేదు. ఇంకా నాలుగేళ్ల పదవీకాలం ఉన్నా బీసీల గురించి ఆలోచించే ఎంపీ పదవికి రాజీనామా చేయాల్సివచ్చింది. ప్రజా ఉద్యమం, బీసీ ఉద్యమమే నా కార్యాచరణ. రాజ్యాధికారంలో వాటాతో పాటు చట్టసభల్లో 50 శాతం సీట్లు ఇవ్వాలి. అసెంబ్లీ ఎన్నికల్లో 21 సీట్లు ఇచ్చారు. స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు పెంచాలి. బీసీల కోసం చాలా త్యాగాలు చేయాల్సివస్తుంది. గ్రామ, మండల, జిల్లా కమిటీలు వేయాలని కోరుతున్నాం. అన్ని పార్టీల వారు ఈ ఉద్యమంలోకి రావాలి. చట్ట సభల్లో బీసీలకు 50 శాతం రిజర్వేషన్లు సాధించడమే నా జీవిత లక్ష్యం. దీనికోసం ప్రతి బీసీ బిడ్డా పోరాడాలి” అని ఆర్.కృష్ణయ్య పిలుపునిచ్చారు.
మరోవైపు ఆర్.కృష్ణయ్యను ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న కలిశారు. బీసీలకు న్యాయం జరగాలని.. అందుకు తనవంతు సహకారం అందిస్తానని చెప్పారు. కాంగ్రెస్ పార్టీలోకి రావాలని కృష్ణయ్యను ఆయన ఆహ్వానించారు.