ఏపీ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు ఆదేశం
న్యూఢల్లీి,అక్టోబరు 17 (ఆంధ్రాత్రిక): ఏపీ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. పోలవరం, పురుషోత్తపట్నం, పట్టిసీమ ప్రాజెక్టుల నిర్మాణంపై ఎన్జీటీ సంయుక్త కమిటీ విధించిన నష్టపరిహారాన్ని వెంటనే జమ చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది.ఎన్జీటీ తీర్పులో అన్ని అంశాలు యథాతథంగా అమలు చేయాల్సిందేనని స్పష్టం చేసింది. రూ.250 కోట్ల పరిహారంపై తదుపరి విచారణ కొనసాగిస్తామని.. అప్పటివరకు ఎన్జీటీ తీర్పులోని మిగిలిన అంశాలు అమలు చేయాలని సూచిం చింది. పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో పర్యావరణ అనుమతుల ఉల్లంఘనపై ఏపీ ప్రభుత్వానికి జరిమానా విధిస్తూ ఇటీవల ఎన్జీటీ తీర్పు ఇచ్చింది. పురుషోత్త పట్నంకు రూ.2.48 కోట్లు, పట్టిసీమకు రూ.1.90 కోట్లు పరిహారం చెల్లించాలని ఆదేశించింది. అయితే, ఈ తీర్పును సవాల్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. దీనిపై విచారణ జరిపిన సుప్రీం ధర్మాసనం.. ఎన్జీటీ సిఫారసులను యథాతథంగా అమలు చేయాలని ఆదేశించింది. దీనికి సంబంధించి ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది. విచారణను వచ్చే ఏడాది ఫిబ్రవరిలో చేపడతామని ధర్మాసనం తెలిపింది.