టిఆర్‌ఎస్‌లో చేరిన 12మందిపై డిజిపికి ఫిర్యాదు
ప్రలోభాలతోనే 12మందిని చేర్చుకున్నారన్న రేవంత్
హైదరాబాద్,ఫిబ్రవరి 9 (ఆంధ్రపత్రిక): ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో కాంగ్రెస్ పార్టీ నుంచి టీఆర్‌ఎస్ లో కలిసిన 12 మంది ఎమ్మెల్యేలపై కూడా విచారణ జరపాలని కోరుతూ టీపీసీసీ అధ్యక్షుడు, ఎంపీ రేవంత్ రెడ్డి రాష్ట్ర డీజీపికి ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఆయన గురువారం విూడియాతో మాట్లాడుతూ..12 మంది ఎమ్మెల్యేలను అధికార పార్టీ ప్రలోభాలకు గురి చేసి కాంగ్రెస్ పార్టీ నుంచి అక్రమంగా చట్ట వ్యతిరేకంగా టీఆర్‌ఎస్ పార్టీలో చేర్చుకున్న అంశంలో గతంలోనే ఫిర్యాదు చేశామని పేర్కొన్నారు. జనవరి 6వ తేదీన మొయినాబాద్ పోలీస్ స్టేషన్‌లో ఈ విషయమై ఫిర్యాదు చేశామని రేవంత్ రెడ్డి వివరించారు.కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలకు ఆర్థిక, రాజకీయ ప్రలోభాలు ఆశ చూపి టీఆర్‌ఎస్‌లో చేర్చుకున్నారని ఈ విషయంలో తాము ఇప్పటికే హైకోర్టులో ఫిర్యాదు చేశామని రేవంత్ రెడ్డి చెప్పారు. ఈ ఎమ్మెల్యేల కొనుగోలుకు సంబంధించి మొయినాబాద్ పోలీస్ స్టేషన్‌లో ఎఫ్‌ఐఆర్ కేసు నెంబర్ 455లో తమ ఫిర్యాదును కూడా జత చేయాలని కోరారు. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేల ప్రలోభాల విషయంలో ముఖ్యమంత్రి కేసీఆర్, 12 మంది ఫిరాయింపు ఎమ్మెల్యేలపై ఫిర్యాదు చేసినట్టు ఆయన పేర్కొన్నారు.