– సీతారాముల కల్యాణానికి విచ్చేసే భక్తుల సౌకర్యార్థం విస్తృత ఏర్పాట్లు
-. ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి బ్రహ్మోత్సవాల పోస్టర్లు ఆవిష్కరించిన టీటీడీ ఈవో
శ్రీ ఎవి ధర్మారెడ్డి, జిల్లా కలెక్టర్ శ్రీ విజయరామరాజు
andhrapatrika ; టీటీడీ లోని అన్ని విభాగాలు, జిల్లా యంత్రాంగం, పోలీసులు సమష్టి కృషి చేసి ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి బ్రహ్మోత్సవాలను విజయవంతం చేయాలని టీటీడీ ఈవో శ్రీ ఎవి ధర్మారెడ్డి అధికారులను కోరారు. బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై వై ఎస్ ఆర్ జిల్లా కలెక్టర్ శ్రీ విజయరామరాజు, జిల్లా ఎస్ పి శ్రీ అన్బురాజన్, జిల్లా యంత్రాంగంతో గురువారం ఒంటిమిట్ట లో ఈవో సమీక్ష నిర్వహించారు.ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ, గతంలో జరిగిన లోటుపాట్లను సవరించుకుని శ్రీ సీతారాముల కల్యాణాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించాలన్నారు. టీటీడీ అధికారులు, జిల్లా అధికారులు సమన్వయంతో పనిచేయాలన్నారు. అన్ని విభాగాల అధికారులు సమన్వయం చేసుకుని బ్రహ్మోత్సవ ఏర్పాట్లను వేగవంతంగా పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ నెల 16వ తేదీ మరోసారి పనుల పురోగతిపై సమీక్ష నిర్వహించనున్నట్లు ఈవో వివరించారు.
మార్చి 30వ తేదీ శ్రీరామనవమితో స్వామివారి బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయన్నారు. ఏప్రిల్ 3వ తేదీ హనుమంత వాహనం, ఏప్రిల్ 4వ తేదీ గరుడవాహనం, ఏప్రిల్ 5వ తేదీ సీతారాముల కల్యాణాన్ని అత్యంత అద్భుతంగా నిర్వహించనున్నట్లు తెలిపారు. శ్రీ సీతారాముల కల్యాణానికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి
శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పిస్తారని తెలిపారు. ఏప్రిల్ 6న రథోత్సవము, ఏప్రిల్ 7న చక్రస్నానం, ఏప్రిల్ 8న పుష్పయాగము జరుగుతాయని చెప్పారు.
వై ఎస్ ఆర్ జిల్లా కలెక్టర్ శ్రీ విజయరామరాజు మాట్లాడుతూ, బ్రహ్మోత్సవాల్లో ప్రధానంగా శ్రీ సీతారాముల కల్యాణానికి విచ్చేసిన భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా జిల్లా యంత్రాంగం విస్తృత ఏర్పాట్లు చేపట్టనున్నట్లు తెలిపారు. ఇందులో భాగంగా భద్రత, పార్కింగ్, అన్నప్రసాదాల పంపిణీ, తాత్కాలిక మరుగుదొడ్లు, నిరంతర విద్యుత్ సరఫరా, ప్రథమ
చికిత్స కేంద్రాలు, ఆర్టీసీ బస్సులు, హెల్ప్ డెస్క్ లు, సైన్ బోర్డులు, పారిశుధ్యం, పబ్లిక్ అడ్రస్ సిస్టం విభాగాలు ఈ నెల 16వ తేదీ లోపు తమ కార్యాచరణ ప్రణాళికలను అందించాలన్నారు.అంతకుముందు టీటీడీ ఈవో, వై ఎస్ ఆర్ జిల్లా కలెక్టర్ తో కలిసి శ్రీ కోదండరామ స్వామి బ్రహ్మోత్సవాల పోస్టర్లను ఆవిష్కరించారు.
ఈ కార్యక్రమంలో టీటీడీ జేఈవో శ్రీ వీర బ్రహ్మం,
వై ఎస్ ఆర్ జిల్లా జాయింట్ కలెక్టర్ శ్రీ సాయి కాంత్ వర్మ , ఎస్వీబీసీ సిఈవో శ్రీ షణ్ముఖ కుమార్ , టీటీడీ
సిఈ శ్రీ నాగేశ్వరరావు జిల్లా యంత్రాంగానికి చెందిన వివిధ విభాగాల అధికారులు పాల్గొన్నారు.