తిరుపతి శ్రీ కోదండరామాలయంలో మార్చి 20 నుంచి 28వ తేదీ వరకు జరుగనున్న వార్షిక బ్రహ్మోత్సవాలను అన్ని విభాగాల అధికారులు సమష్టిగా కృషిచేసి విజయవంతం చేయాలని టీటీడీ జేఈవో
శ్రీ వీరబ్రహ్మం కోరారు. ఆలయంలో మంగళవారం సాయంత్రం బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా జేఈవో మాట్లాడుతూ, మార్చి 20న ధ్వజారోహణంతో బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయని చెప్పారు . ప్రధానంగా మార్చి 22న ఉగాది ఆస్థానం, 24న గరుడ సేవ, 25న హనుమంత వాహనం జరుగుతాయన్నారు. అదేవిధంగా మార్చి 31న శ్రీ సీతారాముల కల్యాణం, మార్చి 30 నుంచి ఏప్రిల్ ఒకటో తేదీ వరకు శ్రీరామనవమి ఉత్సవాలు, ఏప్రిల్ 3 నుంచి 5వ తేదీ వరకు తెప్పోత్సవాలు నిర్వహిస్తామన్నారు.
ఆలయం వద్ద, వాహన సేవల్లో ఆకట్టుకునేలా సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశామన్నారు. విచ్చేసే భక్తులందరికీ తాగునీరు, మజ్జిగ పంపిణీ చేస్తామన్నారు. బ్రహ్మోత్సవాల గురించి వివిధ ప్రాంతాల్లో ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి విస్తృతంగా ప్రచారం చేస్తున్నామన్నారు. మెరుగైన పారిశుద్ధ్య ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించినట్లు చెప్పారు.
సమీక్షలో ఎస్ఇ ఎలక్ట్రికల్
శ్రీ వెంకటేశ్వర్లు, ఆలయ డెప్యూటీ ఈవో శ్రీమతి నాగరత్న, గోశాల డైరెక్టర్ డా. హరనాథ్ రెడ్డి, డెప్యూటీ ఈవోలు శ్రీ గోవిందరాజన్, శ్రీ లోకనాథం, శ్రీమతి శాంతి ఆలయ అర్చకులు
శ్రీ ఆనంద కుమార దీక్షితులు పాల్గొన్నారు.