భూకంపం – ఈ మాట వింటే పై ప్రాణాలే పైనే పోతాయి. ఈ మధ్య టర్కీ, సిరియాలో వచ్చిన భూకంపం ఎంతటి విధ్వంసం సృష్టించిందో చూశాం. ఇండియాలో కూడా ఈ మధ్య కాలంలో అనేక ప్రాంతాల్లో తరచూ భూమి కంపిస్తుండటం, జనాలు భయాందోళనలకు గురవుతుండటం చూస్తునే ఉన్నాం.కర్నూలు జిల్లా తుగ్గలి మండలం రాతన గ్రామం ఇది. ఈ గ్రామంలో నిన్న రాత్రి భూమి కంపించిందని గ్రామస్తులు అంటున్నారు. ఏ స్థాయిలో ఆ ప్రకంపనలు వచ్చాయో రిక్టర్ స్కేల్‌పై నమోదు కాలేదు. గ్రామస్తులు కూడా ఆ భూకంపాన్ని గుర్తించినట్టు లేదు. కాని, చూసేసరికి ఊళ్లలోని అనేక ఇళ్లు బీటలువారాయి. ఒకటి రెండు కాదు 13 ఇళ్లు పగుళ్లిచ్చాయి. గ్రామంలో కొన్ని చోట్ల రోడ్లు కూడా కుంగిపోయాయి. ఇళ్లు ఎక్కడా కూలిపోతాయోననే భయంతో నిన్న రాత్రంతా ఈ ఇళ్ల వాళ్లంతా జాగారమే చేశారు. ఈ ఇళ్లన్నీ కొత్తగా కట్టుకున్నవే. ఊళ్లు దాదాపు 60 మీటర్ల పరిధిలోనే ఇళ్లలో ఈ పగుళ్లు కనిపించాయి.
ఈ విషయం తెలిసిన వెంటనే పత్తికొండ ఎమ్మెల్యే శ్రీదేవి గ్రామానికి చేరుకొని ఇళ్లను పరిశీలించారు. ప్రభుత్వం తరపున నష్టపరిహారం ఇప్పించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. కర్నూలు ఎంపీ సంజీవ్ కుమార్ ఈ గ్రామాన్ని గతేడాది దత్తత తీసుకున్నారు. ఇళ్లు బీటలు వారాయని తెలియగానే ఆయన కూడా గ్రామాన్ని సందర్శించారు. బీటలు వారిన ఇంటి యజమానులను రెండు రోజులు బయట ఉండాలని సూచించారు.అందరూ వచ్చి చూసి వెళ్లారు గాని తమకు ఎవరూ భరోసా ఇవ్వడం లేదని గ్రామస్తులు వాపోతున్నారు. ఇళ్లు బీటలు బారడానికి కారణమేంటో త్వరగా గుర్తించాలని కోరుతున్నారు. అదే సమయంలో తమకు కలిగిన నష్టానికి పరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు. ఇంతకీ రాతన గ్రామంలో భూకంపం వచ్చిందా? ఇళ్లు ఉన్నట్టుండి ఎందుకు బీటలువారాయి? ఇది తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నామని అధికారులు, ప్రజా ప్రతినిధులు అంటున్నారు.