Delhi Liquor Scam, Andhrapatrika : ఢిల్లీ లిక్కర్ స్కామ్ ఇవాళ మరో మలుపు తిరగబోతోందా? BRS ఎమ్మెల్సీ కవితను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) అధికారులు అరెస్టు చేయబోతున్నారా? BRS ఊహాగానాలు నిజం అవుతాయా?ఢిల్లీ లిక్కర్ స్కామ్లో ఇప్పటికే 11 మందిని అరెస్టు చేసిన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) అధికారులు… ఇవాళ BRS ఎమ్మెల్సీ కవితను అరెస్టు చేస్తారనే ఊహాగానాలు స్వయంగా BRS పార్టీ నుంచే వస్తున్నాయి. ఈ కేసులో నిందితుడిగా ఉన్న హైదరాబాద్ వ్యాపారవేత్త అరుణ్ రామచంద్ర పిళ్లై.. తాను కవితకు బినామీని అనీ, అంతా ఆమె చెప్పిన ప్రకారమే చేశానని… ఈడీ విచారణలో స్టేట్మెంట్ ఇవ్వడంతో… కవితను ప్రశ్నించేందుకు ED అధికారులు రెడీ అయ్యారు. ఈ క్రమంలో ఇవాళ ఉదయం 11 గంటలకు కవిత.. ఈడీ అధికారుల ముందు హాజరవుతారు.
నిందితులతో కలిపి విచారణ:
ఇవాళ ఈడీ అధికారులు… లిక్కర్ స్కామ్ కేసులో నిందితులుగా ఉన్న వారితో కలిపి కవితను ప్రశ్నిస్తారని తెలుస్తోంది. ఇద్దరు లేదా ముగ్గురిని ఒకే చోట కూర్చోబెట్టి ప్రశ్నిస్తారని తెలుస్తోంది. ఈ క్రమంలో ఎవరు ఎలాంటి స్టేట్మెంట్ ఇస్తున్నారో అధికారులు నమోదు చేసుకుంటారు. ఎవరైనా తప్పుడు సమాధానాలు చెబుతున్నట్లు అనిపిస్తే.. ఈడీ అధికారులు తమ దగ్గర ఉన్న ఎవిడెన్స్ చూపిస్తూ ప్రశ్నించే అవకాశం ఉంది. తద్వారా తప్పు చేసినట్లు నిందితులతోనే చెప్పించాలనేది ఈడీ వ్యూహంగా తెలుస్తోంది. ఐతే.. ఇవాళ కవితను ఎంతసేపు ప్రశ్నిస్తారన్నది తెలియలేదు.
అరెస్టు అంచనా ఎందుకు?
ఈడీ అధికారులు పిలిచినంత మాత్రాన అరెస్టు చేసేస్తారని ఎందుకు అనుకోవాలి? రామచంద్ర పిళ్లైని 11 సార్లు ప్రశ్నించిన తర్వాతే అరెస్టు చేశారు. కానీ కవితను ఇలా పిలిచి.. అలా అరెస్టు చేసేస్తారనే ఊహాగానాలు ఎందుకు? స్వయంగా తెలంగాణ ముఖ్యమంత్రి, కవిత తండ్రి అయిన కేసీఆర్ .. ఈ అరెస్టు వ్యాఖ్యలు చేయడం కలకలం రేపింది. నిన్న జరిగిన పార్టీ విస్తృతస్థాయి సమావేశంలో పాల్గొన్న కేసీఆర్.. నేతలకు దిశానిర్దేశం చేస్తూ… ఢిల్లీ లిక్కర్ స్కామ్ పై స్పందించారు. “ఎంతమంచిగా పనిచేసినా.. బద్నాం చేసేవాళ్లు ఉంటారు. గతంలో మంత్రి గంగుల కమలాకర్ , ఎంపీ రవిచంద్రను టార్గెట్ చేసి వాళ్లు.. ఇప్పుడు నా కూతురు వరకు వచ్చారు. రేపు (ఇవాళ) విచారణ పేరుతో అరెస్ట్ చేస్తారట” అని కామెంట్ చేసినట్లు తెలిసింది.