మహిళలకే శక్తి సామర్థ్యాలు అధికం…
మహిళను కాబట్టే జిల్లాను ప్రగతిలో నడిపించ గలుగుతున్నా
సమాజంలో ఎదగాలంటే విద్య ఒక్కటే మార్గం
జాతీయ మహిళా దినోత్సవ వేడుకల్లో కలెక్టర్ కృత్తికా శుక్ల
సామర్లకోట, మార్చి 8 ఆంధ్రపత్రిక
సమాజంలో పురుషుల కన్నా శక్తి సామర్థ్యాలు మహిళలకే అధికంగా ఉన్నందున సమాజాన్ని తీర్చిదిద్దే విషయంలో మహిళలు ముందుంటున్నారని జిల్లా కలెక్టర్ కృత్తికా శుక్ల అన్నారు. జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని సామర్లకోట జిల్లా మహిళా సాధికార సంస్థ అయిన టీటీడీసీ ప్రాంగణంలో మహిళా దినోత్సవ వేడుకలు మంగళవారం అతి ఘనంగా నిర్వహించారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు జిల్లా సమాఖ్య, మండల సమాఖ్యల సభ్యులు, అంగన్వాడీలు, ఇతర ప్రభుత్వ ఉద్యోగులకు పలు క్రీడా పోటీలను, రంగవల్లుల పోటీలను నిర్వహించారు. అనంతరం సాయంత్రం నిర్వహించిన మహిళా దినోత్సవ సభలో ముఖ్యఅతిథిగా కలెక్టర్ పాల్గొని ప్రసంగించారు. కలెక్టర్గా ఉన్న తనకు తరచుగా పలువురు ఒక ప్రశ్నను వేస్తున్నారన్నారు. మహిళగా ఉన్న మీరు కాకినాడ జిల్లాను సమర్థవంతంగా ఎలా పాలించగలుగుతున్నారనే ప్రశ్నకు “నేను మహిళను కాబట్టి చేయగలుగుతున్నానని” స్పష్టతనిచ్చారు. ప్రస్తుత సమాజంలో మహిళలు సాధిస్తున్న విజయాలు, కుటుంబాల్లోనూ, ఉద్యోగ వృత్తిలోనూ వారు చూపిస్తున్న ప్రతిమను బట్టి సంవత్సరానికి ఒక్కరోజు కాక ప్రతిరోజు మహిళా దినోత్సవ కార్యక్రమాలు జరుపుకోవాలని అవసరం ఉందన్నారు. మహిళలు అన్ని విషయాల్లోనూ పురుషుల కంటే ఎక్కువ శక్తి సామర్థ్యాలు కలిగి ఉన్నారని దానిని పురుషులు గమనించి మహిళలకు వారి పూర్తి సహకారాన్ని, సమానత్వాన్ని తెలపాలన్నారు. అది జరిగిన నాడు సమాజం ఎంతో అభివృద్ధి చెందుతుందన్నారు. కాకినాడ జిల్లాలో చూస్తే జిల్లా మెజిస్ట్రేట్ గా తాను, ఎంపీగా వంగా గీతా విశ్వనాధ్, డీఆర్డీఏ పీడీ, సామర్లకోట, పెద్దాపురం మున్సిపల్ చైర్ పర్సన్ లు, జడ్పిటిసి, కుడా చైర్మన్, జాయింట్ కలెక్టర్లు, మండల స్థాయి అధికారులు ఇలా ప్రధాన పాత్రలో మహిళలే ఉండి ప్రముఖ పాత్రను పోషిస్తున్నారన్నారు. అయితే కుటుంబాల్లో బాల్య వివాహాలను అరికడుతూ, ఆడపిల్లలను ఉద్యోగం వచ్చేవరకు చదివించి ఆపైనే వివాహాలు చేయాలని అప్పుడే సమాజంలో స్త్రీ కొనియాడ బడుతుందని ఆమె పిలుపునిచ్చారు. ఇంకా కుటుంబం కోసం అహర్నిశలు కష్టపడుతున్న మహిళలు, తల్లులు, కుటుంబ సభ్యుల ఆరోగ్యంతో పాటు మీ ఆరోగ్యాలను జాగ్రత్తగా కాపాడుకోవాలన్నారు. ఈ మహిళా దినోత్సవం రోజున మహిళలంతా సొంత ఆరోగ్యం కోసం ఒక అరగంట సమయాన్ని కేటాయించి ఏదో ఒక వ్యాయామాన్ని అలవాటుగా కొనసాగించాలని నిర్ణయం తీసుకోవాలన్నారు.
రాష్ట్రానికే మచ్చుతునకగా కాకినాడ సమాఖ్యలు :
రాష్ట్ర రాజధానికి ఎప్పుడు వెళ్ళినా కాకినాడ జిల్లాకు చెందిన స్వయం సహాయక సంఘాల అభివృద్ధిని రాష్ట్రస్థాయి అధికారులు కొనియాడుతూ వస్తున్నారని కలెక్టర్ కృత్తికా శుక్ల అన్నారు. జిల్లాలోని యు కొత్తపల్లి తొండంగి మండల సమాఖ్యలు ఏర్పాటు చేసిన చేయూత మార్పులు ఎంతో అభివృద్ధి పథంలో నడుస్తున్నాయి అన్నారు. యు కొత్తపల్లి మార్ట్ ఇప్పటికే కోటి రూపాయల వరకు ఆదాయాన్ని సంపాదించినందున వారిని అభినందించారు. ప్రస్తుతం గోదావరి సమైక్యలో ఉన్న తాళ్ళరేవు మత్స్య సమాఖ్య ద్వారా మరో మాటను ఏర్పాటు చేస్తున్నామన్నారు. అలాగే నూతనంగా ప్రారంభించిన వస్త్ర ఫ్యాషన్ డిజైనింగ్ కేంద్రం కూడా అభివృద్ధి పథంలో నడుస్తుందన్నారు. ఇంకా మహిళలకు ఆర్థికంగానూ సామాజికంగానూ చేయూతనిస్తే ఇలాంటి ఎన్నో విజయాలను సాధించి తీరుతారన్నారు. అలాగే కుటుంబాల్లో ఉన్న కుమారుల విషయమై కలెక్టర్ మాట్లాడుతూ మగ బిడ్డలైన పెద్దవారైన పురుషులైన సమాజంలోనికి వెళ్ళినప్పుడు మహిళల పట్ల, తోటి ఉద్యోగినిల పట్ల, విద్యార్థుల పట్ల గౌరవభావంతో మెలగాలని, అట్టి రీతిగా కుటుంబాల్లోనే కుటుంబ యజమానులు వారికి అవగాహన కల్పించాలన్నారు. అప్పుడే సమాజం అన్ని విధాల అభివృద్ధి చెందుతుందని ఆమె సూచించారు. కార్యక్రమంలో మరో ముఖ్య అతిథి కాకినాడ ఎంపీ వంగా గీత విశ్వనాధ్, కుడా చైర్మన్ రాగిరెడ్డి చంద్రకళ దీప్తి, వైఎస్ఆర్సిపి జిల్లా మహిళా అధ్యక్షురాలు మాజీ కాకినాడ మేయర్ ఎస్ శివప్రసాన్న, డిఆర్డిఏ పిడి కే శ్రీ రమణ తదితరులు మాట్లాడారు. ఈ సందర్భంగా జిల్లాలో ఆయా రంగాల్లో రాణించిన మండల సమాఖ్యల నాయకులకు, డిఆర్డిఏ, వెలుగు కార్యాలయ సిబ్బందికి ప్రత్యేక అవార్డు ప్రధాన కార్యక్రమాలను కలెక్టర్, ఎంపీ ల చేతుల మీదుగా చేపట్టారు. కార్యక్రమంలో ఇంకా సామర్లకోట పెద్దాపురం మున్సిపల్ చైర్ పర్సన్ లు గంగిరెడ్డి అరుణ కృష్ణమూర్తి, బొడ్డు తులసి మంగతాయారు, జడ్పిటిసి ఎలిశెట్టి అమృత, ఎంపీడీవో డి శ్రీ లలిత, జిల్లా సమాఖ్య నాయకులు గుడాల సంధ్యారాణి, కే గంగ తల్లి, ఏ సుమిత్ర, పెద్దాపురం ఎంపీపీ పి సత్యవతి, జిల్లా పరిధిలోని డిఆర్డిఏ, ఇతర ప్రభుత్వ శాఖల అధికారులు, సిబ్బంది డిపిఎం లు, అధిక సంఖ్యలో పాల్గొన్నారు.