దిల్లీ: మద్యం విధానానికి సంబంధించిన సీబీఐ కేసులో దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal)కు ఇంకా ఊరట లభించలేదు. ఈ కేసులో ఆయన దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌పై సుప్రీంకోర్టు (Supreme Court) ఇటీవల తీర్పు రిజర్వ్ చేసిన సంగతి తెలిసిందే.
దీనిపై శుక్రవారం తీర్పు వెలువరించనుంది. ఈమేరకు సుప్రీంకోర్టు వెబ్సైట్లో తీర్పు తేదీని వెల్లడించారు.
మద్యం విధానానికి (Delhi Excise Policy Scam Case) సంబంధించిన సీబీఐ (CBI) కేసులో తన అరెస్టును సవాల్ చేయడంతో పాటు.. బెయిల్ కోసం అభ్యర్థిస్తూ కేజ్రీవాల్ రెండు వేర్వేరు పిటిషన్లు దాఖలు చేశారు. ఇటీవల దీనిపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ఈసందర్భంగా ఆయన తరఫు న్యాయవాది అభిషేక్ మను సింఘ్వి వాదిస్తూ.. సీబీఐ తీరుపై తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేశారు. ”మద్యం విధానంపై కేసు నమోదు చేసిన తర్వాత రెండేళ్ల వరకు సీఎంను అరెస్టు చేయలేదు. ఎప్పుడైతే ఈడీ కేసులో బెయిల్ వచ్చిందో.. వెంటనే సీబీఐ ‘ఇన్స్యూరెన్స్’ అరెస్టుకు పాల్పడింది. అరెస్టుకు ముందు ఎలాంటి నోటీసులు కూడా పంపించలేదు” అని కోర్టుకు వివరించారు. మరోవైపు, కేజ్రీవాల్ బెయిల్ అభ్యర్థనను సీబీఐ వ్యతిరేకించింది. ఈ కేసులో బెయిల్ కోసం ఆయన సెషన్స్ కోర్టుకు వెళ్లకుండా నేరుగా హైకోర్టుకు వెళ్లారని సుప్రీం దృష్టికి తీసుకొచ్చింది. ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం తీర్పును రిజర్వ్ చేసింది.
మద్యం విధానానికి (Liquor scam case) సంబంధించిన మనీలాండరింగ్ కేసులో ఈ ఏడాది మార్చి 21న ఈడీ అధికారులు కేజ్రీవాల్‌ను అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసులో ఇప్పటికే మధ్యంతర బెయిల్ మంజూరైంది. అయితే, సీబీఐ కేసులోనూ కేజ్రీవాల్ (Delhi CM Kejriwal) అరెస్టయ్యారు. జూన్ 27 నుంచి సీబీఐ జ్యుడీషియల్ కస్టడీలో భాగంగా తిహాడ్ జైల్లో ఉన్నారు.