Andhrapatrika: H3N2 : మన దేశంలో ఉన్న రోగాలు చాలవన్నట్లు మరొకటి వచ్చింది. ఇదేమీ కొత్తది కాదు. కానీ ఇద్దర్ని చంపేసింది. ఇంకా ఎంతమందిని చంపుతుందో తెలీదు. దీన్ని ఎలా ఎదుర్కోవాలో, ఏయే జాగ్రత్తలు పాటించాలో తెలుసుకుందాం.మనమంతా అనారోగ్యకర వాతావరణంలో జీవిస్తున్నాం. చుట్టూ వైరస్లు. ఎప్పుడు ఏది దాడి చేసి ప్రాణం పట్టుకుపోతుందో తెలియదు. అప్రమత్తంగా ఉండటం మంచిది. ఇప్పుడు దేశంలో వ్యాపిస్తున్న H3N2 ఫ్లూ వైరస్ వల్ల కర్ణాటక, హర్యానాలో ఒక్కొక్కరు చొప్పున ఇద్దరు చనిపోయారు. దీనిపై కేంద్ర ఆరోగ్య శాఖ… రాష్ట్రాలను శుక్రవారం అలర్ట్ చేసింది. H3N2 అనేది ఓ రకమైన ఇన్ఫ్లూయెంజా వైరస్. వీటిలో 4 రకాలు ఉంటాయి. అవి A, B, C, D. వీటిలో A, B వైరస్లు.. సీజన్లలో వస్తుంటాయి. ఏటా జనవరి నుంచి మార్చి వరకూ ఇవి వస్తాయి. మళ్లీ వానాకాలం ముగిసే సమయంలో వస్తాయి. ఈ రెండు సమయాల్లో మనం జాగ్రత్తగా ఉండాలిచెప్పాలంటే ఇన్ఫ్లూయెంజా వైరస్లు మరీ ప్రాణాంతకమైనవి కావు. వీటికి అంత శక్తి కూడా ఉండదు. కాకపోతే.. ఆల్రెడీ రకరకాల అనారోగ్యాలతో బాధపడేవారికి ఈ వైరస్ సోకితే.. ప్రాణం పోయే పరిస్థితి రాగలదు. అందువల్ల అందరం జాగ్రత్తగా ఉండటం మేలు. దానికితోడు ఈ సంవత్సరం.. H3N2 వైరస్ సోకిన వారికి… దగ్గు, జ్వరం ఇతర అనారోగ్య లక్షణాలు ఎక్కువ కాలం ఉంటున్నాయని డాక్టర్లు తెలిపారు. ఇదివరకు ఇలాంటివి సోకితే.. మందులు వేసుకుంటే సరిపోయేది.. ఇప్పుడు ఆస్పత్రికి తీసుకెళ్లాల్సి వస్తోందని డాక్టర్లు తెలిపారు.
లక్షణాలు : H3N2 ఇన్ఫ్లూయెంజా సోకినవారికి దగ్గు, జ్వరం, చెమట, వికారం, వాంతి అయ్యే ఫీలింగ్, గొంతులో మంట, గొంతు నొప్పి, విరేచనాలు, ముక్కు నుంచి నీరు కారడం, జలుబు లక్షణాలు కనిపిస్తున్నాయి. ఈ లక్షణాలు 5 నుంచి 7 రోజులు కనిపిస్తున్నాయి. వీటిలో అన్నీ అందరికీ కనిపించట్లేదు. కొంతమందికి వైరస్ దాడి ఎక్కువైనప్పుడు ఊపిరి సరిగా ఆడట్లేదు. రొమ్ము దగ్గర నొప్పి కూడా వస్తోంది. ఆహారం మింగలేకపోతున్నారు. జ్వరం చాలా పెరిగిపోతోంది. ఈ లక్షణాలు కనిపించేవారు త్వరగా డాక్టర్ని కలవాలి.ఎలా వ్యాపిస్తుంది? : గాలిలో తుంపర్ల వల్ల ఈ వైరస్ ఒకరి నుంచి ఒకరికి ఈజీగా వ్యాపించగలదు. గర్భిణీలు, పిల్లలు, ముసలివారు, అనారోగ్య సమస్యలతో బాధపడేవారికి ఈ వైరస్ సోకే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.
జాగ్రత్తలు : ఇలాంటివి వచ్చినప్పుడు ప్రభుత్వాలు ఎలాగూ కొన్ని జాగ్రత్తలు తీసుకుంటాయి. అదే సమయంలో మనవంతుగా మనం కొన్ని జాగ్రత్తలు పాటించాలి. అంటే ఎవరికైనా జ్వరం, దగ్గు, జలుబు వంటివి వస్తే.. వారిని ఐసోలేషన్లో ఉంచాలి. త్వరగా డాక్టర్ దగ్గరకు తీసుకెళ్లాలి. వచ్చే 2 వారాల్లో ఈ వైరస్ భారత్ నుంచి పోతుందని కేంద్ర వర్గాలు చెబుతున్నాయి.