పెరుగుతున్న ఫీవర్ కేసులు.. ఆ మందులు వాడొద్దన్న IMA.. పూర్తి వివరాలివే
దేశంలో పెరుగుతున్న సీజనల్ ఫీవర్ కేసులపై ప్రజలను ఇండియన్ మెడికల్ అసోసియేషన్(Indian Medical Association) అప్రమత్తం చేసింది. వ్యాధి లక్షణాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు వివరించింది.
ఫీవర్, జలుబు, దగ్గుతో బాధపడుతున్న రోగులు యాంటీబయాటిక్స్ తీసుకోకూడదని, వైద్య నిపుణులు కూడా రోగులకు సూచించకూడదని శుక్రవారం పేర్కొంది. దీనికి సంబంధించి ట్విట్టర్లో ఓ నోటీసును పోస్ట్ చేసింది. పోస్ట్‌లోని పూర్తి వివరాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.
5-7 రోజులు లక్షణాలు కనిపిస్తాయి
భారతదేశంలో ఫీవర్ కేసులు అకస్మాత్తుగా పెరిగాయని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ తెలిపింది. ఎక్కువ మంది బాధితులకు ఇన్ఫ్లుఎంజా ఎ సబ్టైప్ హెచ్3ఎన్2(Influenza A subtype H3N2)ద్వారా జ్వరం వస్తోందని పేర్కొంది. ఈ ఇన్ఫెక్షన్తో బాధపడుతున్న వ్యక్తుల్లో దగ్గు, వికారం, వాంతులు, గొంతు నొప్పి, జ్వరం, ఒంటి నొప్పులు, అతిసారం వంటి లక్షణాలు కనిపిస్తాయని చెప్పింది. ఈ తరహా ఫీవర్ దాదాపు ఐదు నుంచి ఏడు రోజుల వరకు ఉంటుందని, ఇన్ఫెక్షన్ సోకిన మూడు రోజుల తర్వాత జ్వరం తగ్గిపోతుందని, అయితే దగ్గు మూడు వారాల వరకు ఉంటుందని నోటీసులో స్పష్టం చేసింది.
ఈ వయసు వారిలోనే ఎక్కువ కేసులు
ఇన్ఫ్లుఎంజా, ఇతర వైరస్ల కారణంగా అక్టోబర్ నుంచి ఫిబ్రవరి వరకు సీజనల్ జలుబు లేదా దగ్గు రావడం సర్వసాధారణం. ఈ అనారోగ్య సమస్యలు ఎక్కువగా 50 ఏళ్లు పైబడిన, 15 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్నవారిలో కనిపిస్తాయి. రోగుల్లో జ్వరంతో పాటు ఎగువ శ్వాసకోశ నాళాల ఇన్ఫెక్షన్ కనిపిస్తుంది. న్యుమోనియా సంకేతాలు లేకుండా శ్వాసకోశ నాళాల్లో తాత్కాలిక ఇరిటేషన్, వాపు కనిపిస్తాయి. దీనికి ప్రధాన కారణం వాయు కాలుష్యమని ఐఎంఏ స్పష్టం చేసింది.
యాంటీబయాటిక్ రెసిస్టెన్స్‌కు దారితీసే అవకాశం
ఈ రోగలక్షణాలతో వచ్చిన వారికి చికిత్సను మాత్రమే అందించాలని, యాంటీబయాటిక్స్ సూచించకుండా ఉండాలని IMA వైద్య నిపుణులను కోరింది.యాంటీబయాటిక్స్‌ను అవసరం లేకపోయినా వినియోగిస్తే యాంటీబయాటిక్ రెసిస్టెన్స్‌కు దారితీసే అవకాశం ఉందని హెచ్చరించింది. అతిసారం కేసులను ఉదాహరణగా పేర్కొంది. దాదాపు 70 శాతం కేసులు వైరల్ డయేరియా కారణంగా వస్తున్నాయని, ఈ సమస్యకు యాంటీబయాటిక్స్ అవసరం లేదని, కానీ వైద్యులు ఇప్పటికీ సూచిస్తున్నారని పేర్కొంది. అమోక్సిసిలిన్, నార్ఫ్లోక్సాసిన్, సిప్రోఫ్లోక్సాసిన్, ఆఫ్లోక్సాసిన్, లెవోఫ్లోక్సాసిన్ వంటి యాంటీబయాటిక్స్‌ను దుర్వినియోగం చేస్తున్నారని చెప్పింది. వీటిని డయేరియా, UTI కోసం ఉపయోగిస్తున్నారని తెలిపింది. కరోనా సమయంలో అజిత్రోమైసిన్, ఐవర్‌మెక్టిన్‌లను విస్తృతంగా ఉపయోగించారని, ఇది కూడా రెసిస్టెన్స్‌కు దారితీసిందని తెలిపింది. యాంటీబయాటిక్స్ సూచించే ముందు ఇన్ఫెక్షన్ బ్యాక్టీరియానా కాదా అని నిర్ధారించడం అవసరమని తెలిపింది.
ప్రజలకు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ కొన్ని జాగ్రత్తలు సూచించింది. ఇతరులతో కరచాలనం చేయడం, బహిరంగంగా ఉమ్మివేయడం, డాక్టర్ని సంప్రదించకుండా యాంటీబయాటిక్స్ లేదా ఇతర మందులు తీసుకోవడం, ఇతరులతో కలిసి భోజనం చేయడం వంటి వాటికి దూరంగా ఉండాలని తెలిపింది