కొత్త విద్యా సంవత్సరం నుంచే విశాఖలో రాజధాని కార్యకలాపాలు
మంత్రి గుడివాడ అమర్నాథ్
అందరూ అనుకున్న సమయానికంటే ముందే సీఎం విశాఖ వస్తాయి
రాష్ట్రం నుంచి ఎగుమతులు గణనీయంగా పెరిగాయి
రాష్ట్రంలో మూడు పారిశ్రామిక కారిడార్లు ఉన్నాయి
భౌగోళికంగా పరిశ్రమలకు ఏపీ అనుకూలంగా ఉంటుంది
అమరావతి, మార్చి 6 (ఆంధ్రపత్రిక): రాజధాని అంశంలో ఏపీ మంత్రి గుడివాడ అమర్నాథ్ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి జగన్ కొద్ది రోజుల్లో విశాఖ వస్తారని..ఇక్కడి నుంచే పాలన ప్రారంభమవుతుందని ఆయన అన్నారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి రాజధాని కార్యకలాపాలు కూడా మొదలవుతాయని అన్నారు. అందరూ అనుకున్న సమయానికంటే ముందే సీఎం విశాఖ వస్తారని ఇక్కడి నుంచే పాలన సాగిస్తారని చెప్పారు. గత కొన్ని నెలలుగా రాజధాని విషయంలో అధికార వైకాపా నేతలు వ్యాఖ్యలు చేస్తున్న సంగతి తెలిసిందే.విశాఖ నుంచే పాలన జరుగుతుందని, అందుకు తగిన ఏర్పాట్లు కూడా చురుగ్గా సాగుతున్నాయని వివిధ సందర్భాల్లో పలువురు నేతలు తెలిపారు. తాజాగా విశాఖలో నిర్వహించిన ప్రపంచ పెట్టుబడిదారుల సదస్సులో సీఎం జగన్ కూడా ఇదే అంశాన్ని ప్రస్తావించారు. రాష్ట్రం నుంచి ఎగుమతులు గణనీయంగా పెరిగాయన్న ఆయన.. రాష్ట్రంలో మూడు పారిశ్రామిక కారిడార్లు ఉన్నాయని, భౌగోళికంగా పరిశ్రమలకు ఏపీ అనుకూలంగా ఉంటుందని అన్నారు. ఈ సందర్భంగా విశాఖ త్వరలో పరిపాలన రాజధాని కాబోతోందని, తాను కూడా విశాఖ నుంచే పాలన చేయబోతున్నానని ప్రకటించారు.