పరీక్షా కేంద్రాలకు గంట ముందు చేరిక
నిమిషం ఆలస్యం నిబంధన ఖచ్చితంగా అమలు
గూగుల్‌ను నమ్మి పరీక్షను కోల్పోయిన ఖమ్మం విద్యార్థి
హైదరాబాద్/విజయవాడ,మార్చి 15 (ఆంధ్రపత్రిక): తెలుగు రాష్టాల్ల్రో ఇంటర్ పరీక్షలు మొదలయ్యాయి. తెలంగాణ, ఆంధప్రదేశ్‌లో ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ పరీక్షలు బుధవారం ప్రారంభమయ్యాయి. ఉదయం 9 గంటలకు మొదలైన పరీక్ష మధ్యాహ్నం 12 గంటలకు ముగిసింది. ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ పరీక్షలు గురువారం నుంచి ప్రారంభం అవుతాయి. ఉదయం 9 నుంచి 12 గంటల వరకు పరీక్ష జరగనుంది. ఇంటర్మీడియట్ పరీక్షలను ఏప్రిల్ 4 వరకు నిర్వహించనున్నారు. తెలంగాణలో మొత్తం 9,47,699 మంది పరీక్షలు రాస్తున్నారు. వీరిలో 4,82,677 మంది ఫస్టియర్, 4,65,022 మంది సెకెండీయర్ విద్యార్థులు ఉన్నారు. పరీక్షల పర్యవేక్షణ కోసం స్క్వాడ్స్ పనిచేస్తున్నాయి. విద్యార్థులకు ఏ ఇబ్బంది తలెత్తినా 040 ` 24601010, 040 ` 24655027 నంబర్లకు ఫోన్ చేయవచ్చని బోర్డు అధికారులు సూచించారు. ఇకపోతే ఆంధ్రప్రదేశ్‌లో మొత్తం 10,03,990 మంది విద్యార్థులు పరీక్షలు రాస్తున్నారు. వీరిలో ప్రథమ సంవత్సరం విద్యార్థులు 4,84,197 కాగా.. ద్వితీయ సంవత్సరం విద్యార్థులు 5,19,793 మంది ఉన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 1,489 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. ప్రతి 20`25 పరీక్ష కేంద్రాలకు కలిపి ఒక అంబులెన్సును సిద్ధంగా ఉంచారు. ఇకపోతే తొలిరోజు కొన్ని అపశృతులు తప్పలేదు. నిముషంఆలస్యం విషయాన్ని విద్యార్థులు సీరియస్‌గా తీసుకోకపోవడంతో పలుచోట్ల పరీక్షకు దూరమయ్యారు. ఇంటర్ పరీక్షలంటే ముందుగానే పరీక్షా కేంద్రాన్ని చూసుకోవాలని, సమయం కంటే కాస్త ముందుగానే సెంటర్‌కు చేరుకోవాలని బోర్డు చేసిన హెచ్చరికలను బేఖాతర్ చేశారు. ఓ విద్యార్థి పరీక్షా కేంద్రానికి గూగుల్ మ్యాప్‌ను ఆధారంగా చేసుకొని బయలుదేరాడు. చివరికి ఆ గూగుల్ రాంగ్ లొకేషన్ చూపించింది.. ఇంకేముంది.. అసలు పరీక్షా కేంద్రం ఎక్కడుందా ? అంటూ వెతుక్కొని అక్కడికి చేరుకునేసరికి అరగంట ఆలస్యమైపోయింది.. చేసేదేవిూలేక ఇక ఇంటిదారి పట్టాడు ఆ విద్యార్థి….! ఈ ఘటన ఖమ్మంలోని ఎన్ఎస్ పి ప్రభుత్వ పాఠశాలలో జరిగింది.తెలుగు రాష్టాల్లో ఈరోజు నుండి ఇంటర్ పరీక్షలు ప్రారంభమయ్యాయి. ఉదయం 9 గంటలకే పరీక్షలు ప్రారంభమవుతాయని, ఒక్క నిముషం ఆలస్యమైనా పరీక్షా కేంద్రంలోకి అనుమతించబోమని నిబంధన కూడా ఉంది. ముందే ఎగ్జామ్ సెంటర్ చూసుకోవాలి.. గంట ముందుగానే సెంటర్‌కు చేరుకోవాలని విద్యార్థులకు అధికారులు విజ్ఞప్తి చేసినా పట్టించుకోలేదు. ఈ క్రమంలో ముందుగానే ఎగ్జామ్ సెంటర్‌ను చూసుకోవాలని అధికారులు హెచ్చరిస్తున్నారు. ఇకపోతే ప్రైవేట్ విద్యాసంస్థలకు ముకుతాడు పడనుంది. కొన్ని కార్పొరేట్ కాలేజీలు విద్యార్థులను, తల్లిదండ్రులను ఆకర్షించేందుకు టీవీల్లో, పేపర్లలో ఎక్కడ చూసినా వాళ్ల యాడ్స్ కనిపిస్తుంటాయి. అన్ని గ్రూప్స్‌లో మా కాలేజీ టాప్, ర్యాంకులన్నీ మావే అంటూ ప్రచారం చేసుకుంటారు. అంతేకాకుండా ఒక కాలేజీలో టాప్ ర్యాంక్ సాధించిన విద్యార్థి ఫొటోని అన్ని కాలేజీ పోస్టర్లలో వాడుకుంటున్నారు. దీనివల్ల పిల్లలతో పాటు తల్లిదండ్రులు కూడా తప్పుదోవ పట్టే అవకాశం ఉందని, కార్పొరేట్ కాలేజీలో చదివించాలనే ఆకాంక్షతో సమాజంలో ఒక రేస్ జరుగుతుందని, అలాంటి యాడ్స్ ని ఆపించాలని చాలాకాలంగా సదరు కాలేజీలపై ఆరోపణలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ ఇంటర్ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. ఏ కాలేజీ అయినా ఇకపై అప్రకటన ఇవ్వాలంటే ఇంటర్ బోర్డు పర్మిషన్ తీసుకోవాల్సి ఉంటుంది. యాడ్ కంటెంట్ నియంత్రణ, ఇతర విద్యా సమస్యలపై బోర్డు ఏర్పాటు చేసిన ఎనిమిది మంది సభ్యుల కమిటీ ఈ మేకు మార్గదర్శకాలను రూపొందిస్తోంది. ఒక టాప్ ర్యాంకర్ ఫొటోను ఇతర కాలేజీ యాడ్స్ లో వాడినట్లయితే కంటెంట్ మోడరేషన్ కింద సంబంధిత కాలేజీపై చర్యలు తీసుకోనున్నట్లు ఇంటర్ బోర్డు సెక్రెటరీ, ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ కమిషనర్ నవీన్ మిట్టల్ తెలిపారు. అంతేకాకుండా, నిబంధనలకు విరుద్దంగా ఎక్స్ ట్రా క్లాసులు, స్టడీ అవర్స్ నిర్వహిస్తున్నారు. దీనివల్ల విద్యర్థుల్లో ఒత్తిడి పెరుగుతుంది. అందుకే ఈ సమస్యపై కూడా త్వరలో చర్యలు తీసుకోనున్నట్లు నవీన్ తెలిపారు. టీచర్లకు వచ్చే ఏడాది నుంచి బయోమెట్రిక్ విధానాన్ని అమలు చేయనున్నారు.