14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ
సీబీఐ అరెస్టు విషయంలో జోక్యం చేసుకోలేం : సుప్రీం
దిల్లీ, మార్చి 6 : ఆమ్ఆద్మీ నేత, దిల్లీ మాజీ ఉపముఖ్యమంత్రి మనీశ్ సిసోదియాకు మరోసారి చుక్కెదురయ్యింది. మద్యం కుంభకోణం కేసులో అరెస్టైన ఆయనకు న్యాయస్థానం 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ విధించింది.దీంతో మార్చి 20వరకు ఆయన తిహాడ్ జైల్లో ఉండనున్నారు. ఐదు రోజుల సీబీఐ కస్టడీలో ఉన్న ఆయన్ను నేడు దిల్లీ కోర్టులో ప్రవేశపెట్టారు.మద్యం కుంభకోణం కేసులో వచ్చిన ఆరోపణలపై ఫిబ్రవరి 26న సిసోదియాను సీబీఐ అధికారులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. అనంతరం కోర్టులో హాజరుపర్చగా.. న్యాయస్థానం ఆయనకు ఐదు రోజుల సీబీఐ కస్టడీ విధించింది. తాజాగా అది పూర్తికావడంతో దిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు ముందు హాజరు పరిచారు. అనంతరం కస్టడీని పొడిగించమని సీబీఐ కోరకపోవడంతో 14 రోజుల జ్యుడీషియ్ కస్టడీ విధించినట్లు సమాచారం.మరోవైపు కేంద్రదర్యాప్తు సంస్థ సీబీఐ విచారణ తీరును సవాలు చేస్తూ మనీశ్ సిసోదియా ఇదివరకే సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దానిని పరిశీలించిన సుప్రీం ధర్మాసనం.. సీబీఐ అరెస్టు విషయంలో జోక్యం చేసుకునేందుకు నిరాకరించింది. సీబీఐ అరెస్టు చేయడాన్ని సవాల్ చేయాలనుకుంటే హైకోర్టుకు వెళ్లవచ్చని సూచించింది. ఇదే సమయంలో సిసోదియాను కస్టడీలోకి తీసుకున్న సీబీఐ.. ఐదు రోజుల పాటు ప్రశ్నించి వివరాలు రాబట్టేందుకు ప్రయత్నించింది.