ఇక అక్కడి నుంచే మన పాలన
కేబినేట్ భేటీలో మంత్రులకు జగన్ స్పష్టం
కొందర మంత్రుల పనితీరుపైనా అసహనం
15 బిల్లులకు కేబినెట్ ఆమోదం
2023`27 పారిశ్రామిక విధానానికి ఓకే
అమరావతి,మార్చి 14 (ఆంధ్రపత్రిక): ఈ ఏడాది జూలైలో విశాఖపట్నంకు షిప్ట్ అవుతున్నామని.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మరోమారు స్పష్టం చేశారు. జగన్ అధ్యక్షతన మంగళవారం కేబినెట్ సమావేశం జరిగింది. పలు బిల్లులకు కేబినేట్ ఆమోదం తెలిపింది. అలాగే పారిశ్రామిక విధానాన్ని కూడా ఆమోదిం చారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన మంగళవారం ఉదయం జరిగిన ఏపీ కేబినెట్ సమావేశం జరిగింది. 45 అజెండా అంశాలపై మంత్రివర్గ సమావేశంలో చర్చించగా, అసెంబ్లీలో ప్రవేశపెట్టే 15 బిల్లులకు కేబినెట్ ఆమోదం తెలిపింది. కొత్త ఇండస్టియ్రల్ పాలసీకి కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 2023`27 పారిశ్రామిక విధానానికి సైతం కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. ముందుగా, స్పీకర్ తమ్మినేని సీతారాం అధ్యక్షతన ఏపీ బీఏసీ సమావేశం జరిగింది. 24 వరకు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని బీఎసీ నిర్ణయించింది. 9 రోజులపాటు ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరగనున్నాయి. ఈ నెల 16న బ్జడెట్ ప్రవేశపెట్టాలని బీఏసీలో నిర్ణయం తీసుకున్నారు. ఈ సందర్భంగా జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. జులైలో విశాఖకు తరలివెళుతున్నామని చెప్పారు. విశాఖ నుంచే పాలన ఉంటుందని స్పష్టం చేశారు. విశాఖ నుంచే పరిపాలన ఉంటుందని, ఏపీ రాజధాని విశాఖ అని ఢల్లీిలోనూ, ఇటీవల విశాఖలో జరిగిన పెట్టుబడిదారుల సదస్సులోనూ జగన్ ప్రకటించారు. ఇటు అసెంబ్లీ సమావేశాల్లోనూ విశాఖ గురించి మరోసారి ప్రకటన చేసే ఛాన్స్ ఉంది. ఇదే సమయంలో.. కొందరు మంత్రులకు జగన్ వార్నింగ్ ఇచ్చారు. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాలు అన్నీ వైసీపీనే గెలవాలని స్పష్టం చేశారు. పని తీరును గమనిస్తున్నాను.. ఏ మాత్రం తేడా వచ్చిన ఊరుకోను.. అని జగన్ అన్నట్టు తెలిసింది. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీలుగా మనవాళ్లను గెలిపించాల్సిన బాధ్యత విూదే అంటూ.. మంత్రులను ఉద్దేశించి జగన్ వ్యాఖ్యానించారు. ఇందులో తేడా వస్తే.. మార్పు తప్పదని స్పష్టం చేశారు. జగన్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. అయితే.. జగన్ ఎవరిని ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేశారనే చర్చ కూడా జరుగుతోంది. జూలై నెల నుంచి ప్రభుత్వ పాలన విశాఖపట్నం నుంచి జరుగుతోందని ఆయన చెప్పారు. విశాఖపట్నం వెళ్లేందుకు దాదాపు ముహూర్తం కూడా దాదాపు ఖరారైనట్లు తెలుస్తోంది.