– కిడ్నీ సమస్యలు సైలెంట్ కిల్లర్లు
– బీపీ, షుగర్, స్థూలకాయం తదితర కారణాలతో కిడ్నీ సమస్యలు
– వరల్డ్ కిడ్నీ డే సందర్భంగా స్వర మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో ప్రత్యేక కార్యక్రమాలు
– కిడ్నీ వ్యాధులు, సంరక్షణపై అవగాహన సదస్సు
– కిడ్నీ దాతలైన మహిళలకు, దీర్ఘకాలికంగా డయాలసిస్ చేయించుకుంటున్న పేషేంట్లకు సన్మానం
విజయవాడ, andhrapatrika : మూత్రపిండాలకు సంబంధించిన సమస్యల పట్ల ప్రతి ఒక్కరూ అవగాహన కలిగివుండాలని, నిశబ్దంగా ప్రాణాలను హరించే కిడ్నీ సమస్యల పట్ల నిర్లక్ష్యం వహించడం ఏమాత్రం తగదని ప్రముఖ నెఫ్రాలజిస్ట్, కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ నిపుణులు డాక్టర్ అన్వేష్ అన్నారు. గురువారం వరల్డ్ కిడ్నీ డే సందర్భంగా సత్యనారాయణపురంలోని స్వర మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో ప్రత్యేక కార్యక్రమాలను చేపట్టారు. మూత్రపిండాలకు సంబంధించిన ఆరోగ్య సమస్యలు, కిడ్నీల సంరక్షణ, కిడ్నీ వ్యాధులకు చికిత్సల గురించి అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సదస్సులో డాక్టర్ అన్వేష్ మాట్లాడుతూ.. ప్రపంచ జనాభాలో 10 శాతం మంది, 65 ఏళ్ల వయసు పైబడిన వారిలో సగం మంది కిడ్నీ వ్యాధులతో బాధపడుతున్నారని అన్నారు. ఎర్ర రక్త కణాల తయారీకి సహకరించడం, రక్తాన్ని శుద్ధి చేసి శరీర సమతుల్యతను కాపాడటం, రక్త పీడనాన్ని అదుపు చేయడం వంటి కీలక బాధ్యతలను నిర్వహించే మూత్రపిండాలను జాగ్రత్తగా సంరక్షించుకోవాలని సూచించారు. మధుమేహం, దీర్ఘకాలికంగా అధిక రక్తపోటు, స్థూలకాయం, గుండెజబ్బులతో బాధపడేవారితో పాటు వంశపారంపర్యంగానూ కిడ్నీ సమస్యలు తలెత్తవచ్చని చెప్పారు. పాదాల వాపు, అలసట, ఆకలి మందగించడం, మూత్రం నురుగుగా రావడం వంటివి కిడ్నీ వ్యాధి లక్షణాలుగా గుర్తించి వైద్య పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. మూత్ర పరీక్ష, రక్త పరీక్షల ద్వారా కిడ్నీ వ్యాధులను నిర్ధారించవచ్చని తెలిపారు. వ్యాయామం చేయడం, మధుమేహాన్ని అదుపులో ఉంచుకోవడం, రక్తపోటును నియంత్రణలో ఉంచుకోవడం, ధూమపానం చేయకపోవడం, నొప్పి మాత్రలను అధికంగా వాడకపోవడం, తరచుగా మూత్రపిండాల పనితీరును పరీక్షించుకోవడం ద్వారా, కిడ్నీ వ్యాధుల బారినపడకుండా జాగ్రత్త వహించాలని అన్నారు. కిడ్నీ వ్యాధుల బారినపడిన వారికి రెండు రకాల చికిత్సలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. కిడ్నీలు పాడైనప్పటికీ, క్రమానుసారంగా డయాలసిస్ చేయించుకోవడం, కిడ్నీ మార్పిడి చేయించుకోవడం ద్వారా ఆరోగ్యకరంగా జీవించవచ్చని అన్నారు. సైలెంట్ కిల్లర్లుగా పేర్కొనదగిన కిడ్నీ వ్యాధుల పట్ల అప్రమత్తంగా వ్యవహరిస్తూ, కిడ్నీ సమస్యల బారినపడకుండా తగు జాగ్రత్తలు పాటించాలని డాక్టర్ అన్వేష్ సూచించారు. అనంతరం, స్వర హాస్పిటల్ సీఈవో డాక్టర్ వెంకట్ మాట్లాడుతూ, కిడ్నీ వ్యాధులకు సంబంధించిన అత్యాధునిక చికిత్సలు తమ హాస్పిటల్లో అందుబాటులో ఉన్నాయని చెప్పారు. ఆధునిక సాంకేతికతో కూడిన డయాలసిస్ యూనిట్లు, అంతర్జాతీయ ప్రమాణాలతో తీర్చిదిద్దబడిన కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ విభాగం ద్వారా రోగులకు మెరుగైన సేవలను అందిస్తున్నట్లు డాక్టర్ వెంకట్ తెలియజేశారు. కార్యక్రమంలో భాగంగా.. మహిళా దినోత్సవం, కిడ్నీ డేలను పురస్కరించుకుని పలువురిని హాస్పిటల్ నిర్వాహకులు సత్కరించారు. కిడ్నీ దానమిచ్చిన మహిళలను, దీర్ఘకాలికంగా డయాలసిస్ చేయించుకుంటూ ఆత్మస్థైర్యంతో ముందుకు సాగుతున్న పేషేంట్లను ఈ సందర్భంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో స్వర మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ యూరాలజిస్ట్ డాక్టర్ రవిచందర్, హాస్పిటల్ సిబ్బంది పాల్గొన్నారు.