*• తెలుగు పాట ఖ్యాతిని ప్రపంచ వేదికపై సగర్వంగా చాటిన ఆర్.ఆర్.ఆర్.టీంకు ప్రత్యేక అభినందనలు తెలియజేసిన పూర్వ ఉపరాష్ట్రపతి*•
ది ఎలిఫెంట్ విష్పరర్స్ షార్ట్ ఫిలిం కాదు… పెద్ద బాధ్యతను తెలియజేసే హార్ట్ ఫిలిం*
*13 మార్చి 2023, హైదరాబాద్* Andhrapatrika:
భారతదేశ సినిమా గొప్పతనాన్ని ప్రపంచ వేదికపై చాటిచెప్పిన ఆర్.ఆర్.ఆర్ మరియు ఎలిఫెంట్ విష్పరర్స్ చిత్ర బృందాలకు భారతదేశ గౌరవ పూర్వ ఉపరాష్ట్రపతి శ్రీ ముప్పవరపు వెంకయ్యనాయుడు అభినందనలు తెలియజేశారు.
బెస్ట్ డాక్యుమెంటరీ షార్ట్ ఫిలిం విభాగంలో భారత్ నుంచి నామినేట్ అయిన ది ఎలిఫెంట్ విస్పరర్స్ చిత్రం పర్యావరణం, జీవావరణం, ప్రకృతి పరిరక్షణ మీద అవగాహన కల్పించే విధంగా రూపొందించటం ఆనందదాయకమన్న శ్రీ వెంకయ్యనాయుడు, భవిష్యత్తులోనూ పర్యావరణ పరిరక్షణ బాధ్యతను చాటిచెప్పేవిధంగా మరిన్ని సినిమాలు రావలసిన అవసరం ఉందని ఆకాంక్షించారు. ఇలాంటి వాటిని షార్ట్ ఫిలిం అనకూడదని, పెద్ద బాధ్యతను తెలియజేసే హార్ట్ ఫిలింలు అనాలని ఆయన పేర్కొన్నారు. చిత్ర దర్శకురాలు కార్తికి సోన్ సాల్వెస్, నిర్మాత గునీత్ మోగ్నకు ఆయన ప్రత్యేక అభినందనలు తెలియజేశారు.
ఇక తెలుగు సినిమా ఖ్యాతిని, ముఖ్యంగా తెలుగు పాట ఖ్యాతిని ప్రపంచ వేదికపై సగర్వంగా చాటి నాటు నాటు పాటకు గాను ఉత్తమ ఒరిజినల్ సాంగ్ విభాగంలో ఆస్కార్ దక్కించుకున్న ఆర్.ఆర్.ఆర్. చిత్ర బృందానికి శ్రీ వెంకయ్యనాయుడు ప్రత్యేక అభినందనలు తెలియజేశారు. దర్శకుడు శ్రీ రాజమౌళి, సంగీత దర్శకుడు శ్రీ కీరవాణి, పాటల రచయిత శ్రీ చంద్రబోస్, గాయకులు శ్రీ రాహుల్, శ్రీ కాలభైరవ, నటులు శ్రీ ఎన్టీఆర్, శ్రీ రాంచరణ్ తో పాటు గీతానికి నాట్యదర్శకత్వం వహించిన ప్రేమ్ రక్షిత్ లకు శుభాకాంక్షలు తెలియజేశారు. వారి ప్రతిభ తెలుగు పాటకు గొప్ప ఖ్యాతిని తీసుకొచ్చిందని, ఈ స్ఫూర్తి భవిష్యత్ లోనూ ఇలానే కొనసాగాలని ఆకాంక్షించారు.