ఆరుగురు ప్రాణాలు కోల్పోవడం బాధాకరం
అగ్ని ప్రమాదాల నివారణపై ప్రత్యేక దృష్టి సారించాలి
జనసేనాధినేత పవన్ కళ్యాణ్
అమరావతి, మార్చి 17 (ఆంధ్రపత్రిక): సికింద్రాబాద్‌లోని స్వప్నలోక్ కాంప్లెక్స్‌లో గురువారం రాత్రి జరిగిన అగ్ని ప్రమాదం దురదృష్టకరమని జనసేనాధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. అమరావతిలో ఆయన మాట్లాడుతూ.. ఈ ప్రమాదంలో పాతికేళ్లు నిండకుండానే ఆరుగురు ప్రాణాలు కోల్పోవడం బాధాకరమన్నారు. అగ్ని ప్రమాదాల నివారణపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. ఉద్యోగం కోసం పొట్ట చేత పట్టుకొని హైదరాబాద్ నగరానికి వచ్చిన తెలంగాణ బిడ్డలు.. ఈ ప్రమాదంలో అశువులు బాయడం కలచివేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. కాల్ సెంటర్లో పనిచేస్తున్న వారంతా దిగువ మధ్య తరగతి కుటుంబాలకు చెందిన వారని తెలిసిందన్నారు. అగ్ని ప్రమాదంలో చిక్కుకొని ఎలా బయటపడాలో తెలియక.. పొగతో ఉక్కిరిబిక్కిరి అయి, చివరకు ఆసుపత్రిలో ప్రాణాలు విడిచారని తెలిసి ఆవేదనకు లోనయ్యానన్నారు. అనేక కార్యాలయాలు, వాణిజ్య దుకాణాలు ఉన్న స్వప్నలోక్ కాంప్లెక్స్‌లో.. ఈ ప్రమాదం ఎలా జరిగిందో కూలంకషంగా, శాస్త్రీయంగా దర్యాప్తు చేపట్టాలని పవన్ కళ్యాణ్ డిమాండ్ చేశారు. ఎందుకంటే.. సికింద్రాబాద్ ప్రాంతంలోనే ఇటీవలే ఒక కాంప్లెక్స్‌లో జరిగిన ప్రమాదంలో ముగ్గురు మరణించారని గుర్తు చేశారు. ఇప్పుడు ఈ ప్రమాదం.. మానవ తప్పిదమా? అజాగ్రత్త వల్లా? భవన నిర్మాణ సమయంలో సరైన ప్రమాణాలు పాటించకపోవడమా? అనేది తేలాల్సి ఉందన్నారు. కార్యాలయ సముదాయాలు, షాపింగ్ మాల్స్‌ను తనిఖీ చేయడంతో పాటు అక్కడి విద్యుత్ లైన్ల నిర్వహణను పరిశీలించాలని కోరారు. స్వప్న లోక్ ప్రమాదంలో గాయపడ్డ వారికి మెరుగైన చికిత్స అందించాలన్నారు. అదే విధంగా.. కడుపు కోతకు గురైన కుటుంబాల వారికి తగినంత నష్టపరిహారం ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వాన్ని కోరుతున్నానని పవన్ కళ్యాణ్ వెల్లడిరచారు.