భవనం కూలి ఒకే కుటుంబానికి చెందిన ముగ్గరు మృతి
విశాఖ,మార్చి 23 (ఆంధ్రపత్రిక):విశాఖ నగరం కలెక్టరేట్ సమీపంలోని రామజోగిపేటలో మూడంతస్తుల భవనం కుప్పకూలిన ఘటనలో మృతుల సంఖ్య మూడుకు చేరింది.తాజాగా మరో వ్యక్తి మృతదేహాన్ని రెస్క్యూ సిబ్బంది గురువారం ఉదయం వెలికితీశారు. మృతుడు బిహార్‌కు చెందిన చోటు (27)గా అధికారులు గుర్తించారు.బుధవారం అర్ధరాత్రి దాటిన తర్వాత మూడంతస్తుల భవనం ఒక్కసారిగా కుప్పకూలిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో శిథి లాల కింద పడి బాలిక సాకేటి అంజలి(14), ఆమె సోదరుడు దుర్గాప్రసాద్(17) మృతి చెందగా.. మరో ఐదుగురికి తీవ్ర గాయాలు అయ్యాయి. గాయపడిన వారిలో కొమ్మిశెట్టి శివశంకర, సాకేటి రామారావు, సాకేటి కల్యాణి, సున్నపు కృష్ణ, సాతిక రోజారాణి ఉన్నారు. సమాచారం అందుకున్న పోలీసు, అగ్ని మాపక, ఎన్డీఆర్‌ఎఫ్, రెవెన్యూ బృందాలు ఘటనాస్థలికి చేరుకొని సహాయ చర్యలు చేపట్టాయి. ఈ ఘటనతో పరిసర ప్రజలు భయాందోళనలో ఉన్నారు. ప్రమాద సమయంలో భవనంలో మొత్తం 8 మంది ఉన్నారు. గాయపడిన ఐదుగురిని కేజీహెచ్ ఆసుపత్రికి తరలించారు. సంఘటన స్థలాన్ని డీసీపీ సుమిత్ గరుడ పరిశీలించారు.
నిన్న పుట్టిన రోజు వేడుక.. అంతలోనే..
విశాఖకు చెందిన రామారావు, కల్యాణి దంపతులకు ఇద్దరు సంతానం. భవనం కుప్పకూలిన ఘటనలో ప్రాణాలు కోల్పోయిన సాకేటి అంజలి సోదరుడు సాకేటి దుర్గాప్రసాద్ నిన్ననే తన పుట్టిన రోజు వేడుక చేసున్నాడు. వేడుక చేసుకొని కుటుంబసభ్యులతో సరదాగా గడిపి కొన్ని గంటలు గడవకముందే ప్రమాదంలో దుర్గాప్రసాద్ ప్రాణాలు కోల్పోవడంతో ఆ కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది. ప్రమాదంలో గాయపడిన వారి తల్లిదండ్రులు సాకేటి రామారావు, సాకేటి కల్యాణి ప్రస్తుతం విశాఖ కేజీహెచ్‌లో చికిత్స పొందుతున్నారు. కంటికిరెప్పలా చూసుకుంటున్న ఇద్దరు పిల్లలు ప్రమాదంలో చనిపోవడంతో తల్లిదండ్రుల రోదనలు మిన్నంటాయి.