78.94 లక్షల మంది అర్హులైన మహిళల అకౌంట్లలో నగదు
25న దెందులూరులో జమచేయనున్న సిఎం జగన్
అమరావతి,మార్చి23(ఆంధ్రపత్రిక): పొదుపు సంఘాల మహిళలకు జగన్ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. ఆసరా స్కీమ్ కింద ఈ నెల 25న 78.94 లక్షల మంది అర్హులైన మహిళల అకౌంట్లలో రూ.6,419.89 కోట్ల నగదు ముఖ్యమంత్రి జమ చేయనున్నారు. ఏలారు జిల్లా దెందులూరులో ఈ కార్యక్రమం జరగనుంది. 2019 సార్వత్రిక ఎలక్షన్స్ నాటికి పొదుపు సంఘాల పేరిట మహిళలకు బ్యాంకుల్లో ఉన్న అప్పును ప్రభుత్వమే చెల్లింపులు చేస్తుంది. ఇందుకు సంబంధించిన డబ్బును 4 విడతల్లో చెల్లించే విధంగా అధికారంలోకి వచ్చాక సీఎం జగన్ ఆసరా పథకానికి శ్రీకారం చుట్టారు. కాగా గత ఎన్నికల నాటికి పొదుపు సంఘాల మహిళల పేరిట బ్యాంకుల్లో రూ.25,571 కోట్ల అప్పు ఉంది. ఇందులో ఇప్పటికే 2 దఫాల్లో రూ.12,758.28 కోట్లను మహిళల అకౌంట్లలో సర్కార్ జమ చేసింది. 3వ దఫా ఇప్పుడు అందజేసే రూ.6,419.89 కోట్లతో కలిపి మొత్తం రూ.19,178.17 కోట్లను గవర్నమెంట్ పొదుపు సంఘాల మహిళల అకౌంట్లో జమ చేసినట్టు అవుతుంది. ఈ నగదును ఎలాంటి ఆంక్షలు ఉండవ్. పొదుపు మహిళలు ఏ అవసరానికైనా ఉపయోగించుకోవచ్చని జగన్ సర్కార్ గతంలోనే వెల్లడిరచింది. ఇక పోతే 3వ విడత ఆసరా పంపిణీ సందర్భంగా 10 రోజులపాటు ఉత్సవాలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు జిల్లాల కలెక్టర్లకు ఆదేశాలు వెల్లాయి. స్థానిక ఎంపీ, ఎమ్మెల్యేలు, జెడ్పీటీసీ, ఎంపీటీసీలతోపాటు సర్పంచులు, ఇతర ప్రజాప్రతినిధుల ఈ ఉత్సవాల్లో భాగం అవుతారు.