కె.కోటపాడు, మార్చి26(ఆంధ్రపత్రిక):
మండలంలో పంచాయతీ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని జిల్లా పంచాయతీ వర్కర్స్ అండ్ ఎంప్లాయిస్ యూనియన్ జిల్లా గౌరవ అధ్యక్షులు గనిశెట్టి సత్యనారాయణ కోరారు. పంచాయతీ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఆయన శనివారం మండల ప్రత్యేక అధికారిణి నాగలక్ష్మకి ఎంపీడీఓ కార్యాలయంలో వినతిపత్రం అంద చేశారు.ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ పంచాయతీ కార్మికులకు ఆరు నెలలు నుండితొమ్మిది నెలలు బకాయిల వేతనాలు వెంటనే ఇవ్వాలని డిమాండ్ చేశారు, బట్టలు, సబ్బులు, నూనె, పాద రక్షలు ఇవ్వాలని, మరణించిన కార్మికుని కుటుంబాలకు దహన సంస్కారాలు నిమిత్తం ఆ కుటుంబానికో రూ.5,000ల వంతున చెల్లించాలన్న జీవోను అమలు చేయాలని సత్యనారాయణ కోరారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్మికులు ఈశ్వరరావు, పెంటయ్య, దేముడుబాబు, సి.ఐ.టి.యు. రైతుసంఘం నాయకులు గండి నాయనబాబు, వనుము సూర్యనారాయణ ,యర్రా దేముడు, ఈర్లె నాయుడుబాబు తదితరులు పాల్గొన్నారు.