అలా చేస్తే వైకాపా పెద్ద తప్పు చేసినట్లే..
ఓటర్ లిస్టు వచ్చాక రాజీనామా ఆమోదించడం అనేది సాంకేతికంగా కుదరదు
వైకాపా అసంతృప్తులు వెనక్కు తగ్గుతారనేది ఆ పార్టీ ఆలోచన
విశాఖ,మార్చి 23 (ఆంధ్రపత్రిక):తన రాజీనామాను స్పీకర్ ఆమోదించారంటూ గత రాత్రి నుంచి జరుగుతున్న ప్రచారం పూర్తిగా వైకాపా మైండ్ గేమ్ మాత్రమేనని తెదేపా ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు స్పష్టం చేశారు.ఈ విషయంపై తనకు ఎలాంటి అధికారిక సమాచారం లేదన్నారు. తమ ఎమ్మెల్యేలను కాపాడుకోవడానికే తన రాజీనామాను అమోదించారనే దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. తెదేపాలో ఓ ఎమ్మెల్యే ఓటు వేయలేకపోతున్నారనే భావనను ప్రజల్లోకి తీసుకెళ్లాలనే ప్రయత్నం జరుగుతోందని విమర్శించారు. ఇలా చేస్తే.. వైకాపా అసంతృప్తులు వెనక్కు తగ్గుతారనేది ఆ పార్టీ ఆలోచన అని గంటా పేర్కొన్నారు.‘’రెండేళ్ల క్రితం రాజీనామా చేసి స్పీకర్ను వ్యక్తిగతంగా రెండుసార్లు కలిశా. నాటి నుంచి ఆమోదించకుండా ఉండిపోయిన రాజీనామాను గంటలో ఓటింగ్ అనగా ఆమోదిస్తారా? ఓటర్ లిస్టు వచ్చాక రాజీనామా ఆమోదించడం అనేది సాంకేతికంగా కుదరదు. అలా చేస్తే వైకాపా పెద్ద తప్పు చేసినట్లే అవుతుంది. పంచుమర్తి అనూరాధ నామినేషన్ పత్రాలపై ప్రపోజల్ సంతకం చేసింది నేనే. మా అభ్యర్థి అనురాధ గెలవబోతున్నారు’’ అని గంటా శ్రీనివాసరావు వెల్లడిరచారు.