చైనా కమ్యూనిస్టు పార్టీ, ప్రభుత్వం మధ్య విభజనను చెరిపివేస్తున్నారా?
చైనా మీద తన పట్టును మరింత బిగించనున్నారు ఆ దేశ అధ్యక్షుడు షీ జిన్‌పింగ్.
‘టు సెషన్స్’ అని పిలిచే నేషనల్ పీపుల్స్ కాంగ్రెస్(ఎన్పీసీ), చైనీస్ పీపుల్స్ పొలిటికల్ కన్సల్టేటివ్ కాన్ఫరెన్స్(సీపీపీసీసీ) సమావేశాలు అందుకు వేదిక కానున్నాయి.2022 అక్టోబరులో చైనా కమ్యూనిస్ట్ పార్టీ షీ జిన్‌పింగ్‌ను మరొకసారి తమ నాయకునిగా ఎన్నుకుంది. దాంతో చైనాకు ఆయన మూడోసారి అధ్యక్షుడు కానున్నట్లు నాడు తేలిపోయింది.ఇప్పుడు ఎన్పీసీ అధికారికంగా షీ జిన్‌పింగ్‌ను అధ్యక్షునిగా ధ్రువీకరించనుంది. అలాగే ఆయన బృందంలో ఎవరు ఉండాలో కూడా నిర్ణయించనుంది.చైనాలో ప్రతి ఏడాది ఈ రెండు సమావేశాలు జరుగుతుంటాయి. కానీ ఈ ఏడాది సమావేశాలకు చాలా ప్రాధాన్యం ఉంది. కమ్యూనిస్ట్ పార్టీ, ప్రభుత్వ వ్యవస్థలకు సంబంధించిన అనేక కొత్త నిర్ణయాలు ఈ సమావేశాల్లో ఉండొచ్చని భావిస్తున్నారు.ఆర్థిక, సాంకేతిక విభాగాల మీద షీ జిన్‌పింగ్ బృందం తమ పట్టును మరింత పెంచుకోనున్నట్లు తెలుస్తోంది. తద్వారా చైనా కమ్యూనిస్ట్ పార్టీ, ప్రభుత్వం మధ్య విభజనను తొలగించే ప్రయత్నాలు జరగనున్నాయి. ప్రైవేటు రంగం మీద పార్టీ ఆధిపత్యం మరింత పెరిగే అవకాశం ఉంది.అవినీతి అణచివేత పేరుతో షీ జిన్‌పింగ్ ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటున్నారు. కొంత కాలంగా పెద్దపెద్ద వ్యాపారవేత్తలు కనిపించకుండా పోతున్నారు. టెక్నాలజీ రంగానికి చెందిన టాప్ డీల్ మేకర్ బావో ఫాన్‌ను ఇటీవలే చైనా అధికారులు తీసుకెళ్లారు.చైనాలో ఎన్పీసీ అనేది పార్లమెంటుతో సమానం. అత్యంత శక్తివంతమైన ప్రభుత్వ విభాగం. కానీ వాస్తవానికి ఇదొక రబ్బర్ స్టాంప్ మాదిరిగా ఉంటుంది. కీలక నిర్ణయాలన్నీ చైనా కమ్యూనిస్ట్ పార్టీ(సీపీసీ) తీసుకుంటుంది. పార్టీ తీసుకున్న నిర్ణయాలను చట్టాలుగా ఎన్పీసీ తెస్తుంది.
చైనీస్ పీపుల్స్ పొలిటికల్ కన్సల్టేటివ్ కాన్ఫరెన్స్(సీపీపీసీసీ):
రాజకీయ సలహాలు ఇచ్చే ఈ సంస్థకు శాసన అధికారాలు ఉండవు. దేశంలోని అనేక రంగాలకు చెందిన వారు దీని సమావేశాలకు హాజరవుతారు. సామాజిక, ఆర్థిక రంగాల్లో వస్తున్న మార్పుల మీద వారు మాట్లాడతారు.
రికార్డు స్థాయిలో షీ జిన్‌పింగ్ మూడోసారి చైనా అధ్యక్షుడు అవుతున్నారు.ఇంత వరకు చైనాలో మావో మాత్రమే దీర్ఘకాలం పాటు అధ్యక్ష పదవిలో ఉన్నారు. షీ జిన్‌పింగ్‌కు మార్గం సులభం చేసేలా 2018 ఎన్పీసీ సమావేశాల్లో కాల పరిమితిని తొలగిస్తూ నిర్ణయం తీసుకున్నారు.అంతర్జాతీయంగా చూస్తే జిన్‌పింగ్ పాలనలో అమెరికాతో చైనా సంబంధాలు మరింత బలహీనపడుతున్నాయి. రష్యా-యుక్రెయిన్ యుద్ధంలో పుతిన్‌ను షీ జిన్‌పింగ్ వెనుకేసుకు రావడం, ఇటీవల అమెరికా ఆకాశంలో చైనా ‘నిఘా’ బెలూన్ కనిపించడం వంటివి రెండు దేశాల మధ్య దూరాన్ని మరింత పెంచాయి.చైనా ఆర్థిక, పాలనా వ్యవహరాలు చూసే ప్రీమియర్ స్థానంలో కొత్త వ్యక్తిని ఎన్పీసీ నియమించనుంది.ప్రస్తుతం ప్రీమియర్‌గా ఉన్న లీ కెకియాంగ్ స్థానంలో లీ కియాంగ్ వస్తారని భావిస్తున్నారు. షాంఘై పార్టీ సెక్రటరీగా ఉన్న కాలంలో కఠిన కోవిడ్ ఆంక్షలతో ఆయన అంతర్జాతీయ వార్తల్లో నిలిచారు.సమానమైన పొలిట్‌బ్యూరో స్టాండింగ్ కమిటీ సభ్యులను కూడా ఈ సమావేశాల్లో నిర్ణయించనున్నారు. వాణిజ్యశాఖ, నేషనల్ డెవల్మెంట్, రిఫార్మ్ కమిషన్, ప్రొపగండ చీఫ్, స్టేట్ సెక్యూరిటీ వంటి పదవులు ఎవరికి దక్కుతాయా? అని చాలా మంది ఆసక్తిగా చూస్తున్నారు.ఈ ఎంపికలో అనుభవం, అర్హత కన్నా షీ జిన్‌పింగ్‌కు పట్ల విధేయతకే అధిక ప్రాధాన్యం లభించొచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు.