దేశంలో ఇన్‌ఫ్లూయెంజా (Influenza) కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. హాంకాంగ్ వైరస్ పిలుచుకునే హెచ్3ఎన్2 (H3N2) వైరస్ కారణంగా దేశవ్యాప్తంగా ఇప్పటికే పలు ప్రాంతాల్లో ఈ ఫ్లూ కేసులు నమోదు కాగా..మరణాలు కూడా సంభవించాయి.
భువనేశ్వర్ Andhrapatrika : దేశంలో ఇన్‌ఫ్లూయెంజా (Influenza) కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. హాంకాంగ్ వైరస్ పిలుచుకునే హెచ్3ఎన్2 (H3N2) వైరస్ కారణంగా దేశవ్యాప్తంగా ఇప్పటికే పలు ప్రాంతాల్లో ఈ ఫ్లూ కేసులు నమోదు కాగా.. మరణాలు కూడా సంభవించాయి. వైరస్ కారణంగా ఇప్పటివరకు ఆరుగురు చనిపోయారని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. అయితే ప్రభుత్వం మాత్రం ఇద్దరు మృతిచెందగా జనవరి 2 నుంచి మార్చి వరకు 5,451 కేసులు నమోదయ్యాయని తెలిపింది. కాగా, ఒడిశాలో (Odisha) గత రెండు నెలల్లో 59 హెచ్3ఎన్2 (H3N2) ఇన్ఫ్లుయెంజా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని ప్రభుత్వం ప్రకటించింది. జనవరి, ఫిబ్రవరి నెలల్లో మొత్తం 225 నమూనాలను సేకరించామని, అందులో 59 మందికి వైరస్ నిర్ధారణ అయిందని అధికారులు తెలిపారు. వారిలో సాధారణంగా సీజనల్ వ్యాధుల్లానే వారిలో లక్షణాలు ఉన్నాయని, వాటికి తోడు జర్వం, దగ్గు కూడా ఉన్నాయని వెల్లడించారు.
ఇతర ఇన్ఫ్లుయెంజా రకాలతో పోల్చుకుంటే ఈ హెచ్3ఎన్2 సబ్టైప్ కాస్త తీవ్రంగా వ్యాపిస్తోంది. దీని వల్లే దేశంలో జర్వం కేసులు నానాటికీ పెరుగుతున్నాయని కేంద్రం భావిస్తున్నది. హెచ్3ఎన్2 ప్రాణాంతకం కాదని నిపుణులు చెబుతున్నారు. అయితే తప్పకుండా తగిన జాగ్రత్తలు పాటించాలని సూచిస్తున్నారు. ఇన్ఫ్లుయెంజా బారిన పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలను ప్రభుత్వం సూచించింది.
ఇన్ఫ్లుయెంజా వైరస్ లక్షణాలు
హెచ్3ఎన్2 ఇన్ఫ్లుయెంజా సోకిన వారికి 3 నుంచి 5 రోజుల వరకు జ్వరం ఉంటుంది. అయితే దగ్గు మాత్రం మూడు నుంచి ఐదు వారాల వరకు కొనసాగే అవకాశం ఉంది. అంటే జ్వరం తగ్గినా దగ్గు మాత్రం ఉంటుంది. గొంతు నొప్పి, ఒళ్లు నొప్పులు, వాంతులు, విరేచనాలు ఉంటాయి. కొందరికి శ్వాస తీసుకోవడంలోనూ ఇబ్బందులు ఎదురుకావొచ్చని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ వెల్లడించింది.
ఎలా వ్యాప్తి చెందుతుందంటే..
హెచ్3ఎన్2 ఇన్ఫ్లుయెంజా సోకిన వ్యక్తి దగ్గినప్పుడు, తుమ్మినప్పుడు వెలువడే తుంపరల ద్వారా ఎక్కువగా ఇది వ్యాపిస్తుంది. అలాగే తుంపరలు ఉన్న ప్రదేశాన్ని ఎవరైనా తాకి తమ ముక్కు, నోటిని చేతిలో ముట్టుకున్నా కానీ అలాంటి వారికి కూడా ఈ హెచ్3ఎన్2 ఇన్ఫ్లుయెంజా వైరస్ సోకే ప్రమాదం ఉంటుంది.
తీసుకోవాల్సిన జాగ్రత్తలు
చేతులను ఎప్పుడూ శుభ్రంగా ఉంచుకోవాలి. తరచూ సబ్బు, నీటితో కడుక్కోవాలి.
జనాలు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో ముఖానికి మాస్కు ధరించాలి.
దగ్గినప్పుడు, తుమ్మినప్పుడు తుంపరలు బయటికి రాకుండా నోరు, ముక్కును కవర్ చేసుకోవాలి.
నీటితోపాటు ఇతర ద్రవాలు ఎక్కువగా తీసుకుంటూ హైడ్రేటెడ్‌గా ఉండాలి.
ముఖం, ముక్కును చేతులతో తాకకూడదు, బహిరంగ ప్రదేశాల్లో అసలు ఉమ్మకూడదు