రెండిరటిలో టీడీపీకి భారీ ఆధిక్యం !
అమరావతి, మార్చి 17 (ఆంధ్రపత్రిక): ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన మూడు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటర్లు గట్టి షాక్ ఇచ్చారు. తిరుగులేని విజయాలు సాధిస్తామని ఆ పార్టీ నేతలు ఆశలు పెట్టుకున్నారు. అయితే ఉత్తరాంధ్ర, తూర్పు రాయలసీమ పట్టభద్రుల నియోజకకర్గాల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు అందనంత మెజార్టీతో ముందంజలో ఉన్నారు. పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ అభ్యర్థి లీడ్‌లోఉ న్నప్పటికీ అదిచాలా స్వల్పం. ద్వితీయ ప్రాధాన్య ఓట్లు ఇక్కడ కీలకం కానున్నాయి. ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ హవా కొనసాగుతోంది. వరుసగా నాలుగు రౌండ్లలో టీడీపీ అభ్యర్థి వేపాడ చిరంజీవి రావు ఆధిక్యంలో ఉన్నారు. ప్రస్తుతం ఐదో రౌండ్ కౌంటింగ్ ప్రారంభమైంది. అన్ని రౌండ్లలోనూ టీడీపీ అభ్యర్థి ఆధిక్యంలో ఉన్నారు. ఇప్పటి వరకూ ఏడు రౌండ్ల ఫలితాలు వెలువడ్డాయి. టీడీపీ అభ్యర్థి వేపాడ చిరంజీవికి ఏడు రౌండ్ల మీద 26,358 ఓట్ల ఆధిక్యతో ఉన్నారు. మొత్తం పోలైన ఓట్లలో తెలుగుదేశం పార్టీకి 80,762 ఓట్లు పోల్ అయ్యాయి. వైఎస్ఆర్సీపీ అభ్యర్థి సీతంరాజు సుధాకర్ కు 54,404 ఓట్లు, పీడీఎఫ్ అభ్యర్థి కోరాడ రమాప్రభకు 33464 ఓట్లు పోల్ అయ్యాయి. ఇక సిట్టింగ్ ఎమ్మెల్సీ, బీజేపీ అభ్యర్థి పీవీఎన్ మాధవ్ కు అతి తక్కువగా 8988 ఓట్లు మాత్రమే పోల్ అయ్యాయి. అటు తూర్పు రాయలసీమ పట్టభద్రుల నియోజకవర్గంలో ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ ఆధిక్యం కొనసాగుతోంది. 6వ రౌండ్ ముగిసే సరికి టీడీపీ అభ్యర్థి కంచర్ల శ్రీకాంత్‌కు 28000 ఓట్ల ఆధిక్యం లభించింది. మొత్తం పోలైన ఓ్టలలో టీడీపీకి 69,910 ఓట్లు పోల్ అయ్యాయి. వైసీపీ అభ్యర్థి పేర్నాటి శ్యామ్ ప్రసాద్ రెడ్డికి 46,632 ఓట్లు వచ్చాయి. పీడీఎఫ్ అభ్యర్థికి 30,116, బీజేపీ అభ్యర్థికి 7,112 ఓట్లు లభించాయి. మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపులో తెలుగుదేశం అభ్యర్థికి భారీ ఆధిక్యత లభిస్తోంది. మొత్తం 2.70లక్షల ఓట్లు పోలయ్యాయి. ఒక్కోరౌండ్‌కు 40వేల ఓట్ల లెక్కింపు ఉంటుంది. అందులో ప్రతీరౌండ్‌లోనూ దాదాపు మూడువేల ఇన్వాలిడ్ ఓట్లు వస్తున్నాయి. మొత్తం ఏడు రౌండ్లలో ఓట్ల లెక్కింపు జరుగనుంది. ఈ క్రమంలో మొదటి ప్రాధాన్యత ఓట్లలోనే శ్రీకాంత్ గెలుపొందే అవకాశాలు కనిపిస్తున్నాయని భావిస్తున్నారు. పశ్చిమ రాయలసీమ ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ హోరాహోరీ సాగుతోంది. పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ అభ్యర్థి స్వల్ప ఆధిక్యలో కొనసాగుతున్నారు. ఆరో రౌండ్ తర్వాత వైఎస్ఆర్సీపీ ఆభ్యర్థికి పధ్నాలుగు వందల ఓట్ల మెజార్టీ ఉంది. కౌంటింగ్‌లో 10 నుంచి 11 రౌండ్లు కొనసాగనున్నాయి.ఈ స్థానంలో ద్వితీయ ప్రాధాన్య ఓట్లతో విజేత ఎవరో తెలిసే అవకాశం ఉంది. ఆరో రౌండ్లో టీడీపీ అభ్యర్థికి 150కిపైగా ఓట్ల మెజార్టీ లభించింది. ఈ స్థానం ఫలితం శనివరం ఉదయానికి వెల్లడిరచే అవకాశం ఉంది.